
మంగళవారం దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ 2022 సూపర్ 4పోరులో శ్రీలంక చేతిలో ఆరు వికెట్ల తేడాతో భారత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇక ఈ ఓటమి అనంతరం భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. కెప్టెన్ రోహిత్ శర్మ వ్యూహాలు బెడిసికొట్టాయన్నాడు. రోహిత్ ఓ చిన్న ట్రిక్ మిస్సయ్యాడని, అసలు ఆ పాయింట్ ఎందుకు మిస్సయ్యాడనేది అర్థం కావడం లేదని పేర్కొన్నాడు. భువీకి కాకుండా అర్ష్‌దీప్ సింగ్‌కు 19వ ఓవర్ ఇవ్వాల్సిందని, భువీ చేత 20వ ఓవర్ వేయించాల్సిందని ఈ ట్రిక్ రోహిత్ శర్మ మిస్ అయ్యాడని ఇర్ఫాన్ ఎత్తి చూపాడు. తద్వారా చివరి ఓవర్లో 10కి మించి పరుగులు డిఫెండ్ చేసుకునే వీలుండేదని.. మ్యాచ్ పరిస్థితి వేరేలా ఉండేదని పఠాన్ అభిప్రాయం.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కూడా భువీకి 19వ ఓవర్ ఇవ్వగా అతను 19పరుగులు ఇచ్చిన సంగతి తెలిసిందే. 'ఈ పిచ్‌లో 180కి దగ్గరగా పరుగులు చేస్తే అది మంచి స్కోర్ అని నేను అనుకున్నాను. ఎందుకంటే మైదానంలో మంచు లేదు. మంచు లేకపోతే, బౌలింగ్ చేయడం చాలా తేలిక అవుతుంది. పడ్డ నాలుగు వికెట్లు కూడా స్పిన్నర్ల ద్వారానే వచ్చాయి. ఫాస్ట్ బౌలర్లకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు' అని ఇర్ఫాన్ పఠాన్ తెలిపాడు.
'రోహిత్ శర్మ రెండు సార్లు ట్రిక్ మిస్సయ్యాడు. ఒకటి దీపక్ హుడా చేత బౌలింగ్ చేయించలేదు. రెండవది.. అర్ష్‌దీప్ సింగ్‌కు 19వ ఓవర్‌ని ఇవ్వలేదు. అతను 19వ ఓవర్ బౌలింగ్ చేసి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేది. మొత్తంమీద చెప్పాలంటే.. మొదటి 10 ఓవర్లలో టీమిండియా నుంచి కచ్చితంగా మెరుగైన బౌలింగ్ పడాల్సి ఉండాల్సింది' అని పఠాన్ చెప్పాడు. శ్రీలంక ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. భారత్ విధించిన 174 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. కుసాల్ మెండిస్ 57పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా.. అతని ఓపెనింగ్ భాగస్వామి పాతుమ్ నిస్సాంక 52, దసున్ షనక 33నాటౌట్ రాణించారు.
భారత్ తరఫున యుజ్వేంద్ర చాహల్ 34పరుగులిచ్చి మూడు వికెట్లు తీయగా, రవిచంద్రన్ అశ్విన్ ఒక వికెట్ తీశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 8వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది, కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 72పరుగులు చేయగా, సూర్యకుమార్ యాదవ్ 34పరుగులు చేశాడు. ఒకానొక దశలో 180 నుంచి 190 స్కోరు ఈజీగా వస్తుందని అంతా అనుకున్నారు. ఇక రోహిత్ ఔటయ్యాక వచ్చినవారు పెద్దగా స్టాండ్ ఇవ్వకపోవడంతో స్కోరు 173కే పరిమితమైంది. శ్రీలంక బౌలర్ దిల్షాన్ మధుశంక (3/24), చమిక కరుణరత్నే (2/27), దసున్ షనక (2/26) మెరుగైన బౌలింగ్ ప్రదర్శన కనబరిచారు. గురువారం భారత్ ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది.