
వడోదర: 'సంక్రాంతి' పండగ వచ్చిందంటే దేశమంతటా పతంగుల సందడి నెలకొంటుంది. పండగ ముందు నుంచి అయిపోయాక కూడా ఆకాశంలో ఎక్కడ చూసినా గాలి పటాలే కనిపిస్తుంటాయి. గిర్రుగిర్రుమంటూ విమానాలతో పోటీపడి మరీ ఎగురుతుంటాయి. పల్లెలు, పట్టణాలు.. చిన్నా, పెద్ద.. మతాలతో సంబంధం లేకుండా అందరూ పతంగులను ఎగురవేస్తూ సందడి చేస్తారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా సంక్రాంతి పండగ సందర్భంగా పతంగి ఎగురవేశాడు. గుజరాత్ వడోదరలోని తన ఇంటి డాబామేడపై కుటుంబ సభ్యులతో కలిసి గాలిపటాల వేడుకను జరుపుకున్నాడు.
అయితే ఇర్ఫాన్ పఠాన్ ఎగురవేసిన గాలిపటం ఎగురుతూ ఎగురుతూ ఒక్కసారిగా కిందపడింది. గాలి పటం పడిపోతుందని.. కింద క్రికెట్ ఆడుకుంటున్న పిల్లలకు చెప్పాడు. క్రికెట్ ఆడడం మానేసి గాలిపటం కోసం పిల్లలు పరుగులు పెట్టారు. నలుగురు పిల్లలు పోటీపడ్డారు. నేను కూడా చిన్నప్పుడు అలానే చేశానని.. ఆ వీడియోను సోషల్ మీడియా ద్వారా ఇర్ఫాన్ అభిమానులతో పంచుకున్నాడు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. గుజరాత్‌లో ఉత్తరాయణ్ పేరిట సంక్రాంతి పండుగను జరుపుకుంటారు.
టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ 2020, జనవరి 4న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 19 ఏళ్ల వయస్సులో 2003లో అరంగేట్రం చేసిన ఇర్పాన్ పఠాన్ తన కెరీర్‌లో 29 టెస్టులు, 120 వన్డేలు, 24 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్లు కలిపి 301 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20ల్లో 172 పరుగులు సాధించాడు. టీమిండియా అందించిన ఉత్తమ ఎడమచేతివాటం స్వింగ్ బౌలర్ పఠానే. సుమారు తొమ్మిదేళ్ల పాటు ఇర్ఫాన్ భారత్ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.
ఇర్ఫాన్ పఠాన్ తన కెరీర్‌లో సెకండ్ ఇన్సింగ్స్ మొదలుపెట్టాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ ఆల్‌రౌండర్.. కోలీవుడ్ ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తమిళ్ స్టార్ హీరో విక్రమ్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అజయ్ జ్ఞానముతు దర్శకత్వంలో వస్తున్న 'కోబ్రా' సినిమాలో విలన్ రోల్ పోషించాడు. అస్లాన్ ఇల్మాజ్ పాత్రలో పఠాన్ కనిపించనున్నాడు. కోబ్రా చిత్రంలో విక్రమ్ హీరోగా, ఇర్ఫాన్ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.