బెంగళూరు: తాను చాలా అందమైన దశకు చేరుకున్నానని ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. గత వారమే ఇర్ఫాన్ పఠాన్ సౌదీ అరేబియాకు చెందిన మోడల్ సఫా బేగ్(21) అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.
సఫా బేగ్ వివాహం చేసుకుని తాను కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించానని 31ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. గురువారం తన భార్యతో దిగిన సెల్ఫీని పఠాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'నా జీవితంలో అందమైన దశలో ప్రవేశించాను. మమ్మల్ని ఆశీర్వదించిన వారందరికీ మేమిద్దరం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం' అని ఇర్ఫాన్ ఆదివారం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించాడు.
గత శనివారం ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) కోసం జరిగిన వేళంలో రూ. కోటి వెచ్చించి రైజింగ్ పుణె జట్టు ఇర్ఫాన్ పఠాన్‌ను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 2003 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచుతో ఇర్ఫాన్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. అక్టోబర్ 2012 వరకు కూడా ఇర్ఫాన్ అంతర్జాతీయ మ్యాచుల్లో ఆడాడు.

కాగా, మళ్లీ తాను టీమిండియాకు ఎంపికవుతాననే ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు ఇర్ఫాన్'ఫస్ట్ క్లాస్ ఆడిన ప్రతీ క్రికెటర్ లక్ష్యం టీమిండియా తరపున ఆడటమే. అందుకోసమే నేను రంజీ మ్యాచులు ఆడుతున్నా. నేను ఇండియా తరపున మళ్లీ ఆడతాననే అనుకుంటున్నా. నేను నా నోటికి పని తగ్గించి అందుకోసం కృషి చేస్తా. నా ప్రతిభను మెరుగుపర్చుకుంటున్నా' అని ఇటీవలో ఓ ఇంటర్వ్యూలో ఇర్ఫాన్ పేర్కొన్నాడు.
గత నెలలో ఇర్ఫాన్ పఠాన్ బరోడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. సయ్యద్ ముస్తక్ అలీ ట్వంటీ20 టోర్నమెంటులో ఇర్ఫాన్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఫైనల్లో సురేష్ రైనా నాయకత్వంలోని ఉత్తరప్రదేశ్ జట్టు చేతిలో ఇర్ఫాన్ జట్టు ఓటమి పాలైంది.