బుడ్డోడికి తప్పిన ప్రమాదం.. వైభవ్ కోసం భయపడ్డ ఇర్ఫాన్ పఠాన్!
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం పాలై రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి వైదొలగినప్పటికీ.. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత పోరాటంతో అందరి మనసులు గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్.. రాజస్థాన్ జట్టు 214 పరుగుల భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ ఇన్నింగ్స్ సమయంలో గుజరాత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, కగిసో రబాడలు ఈ 15 ఏళ్ల చిన్నారిని కట్టడి చేయడానికి అనుసరించిన వ్యూహంపై టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
వైభవ్ సూర్యవంశీపై గుజరాత్ టైటాన్స్ పేసర్లు 'బాడీ-లైన్' బౌలింగ్ వేయడాన్ని తప్పుబడుతూ టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ చేసిన కామెంట్స్ తీవ్ర చర్చకు దారితీశాయి. 15 ఏళ్ల వయసున్న వైభవ్‌ను కట్టడి చేయడానికి గుజరాత్ బౌలర్లు నిరంతరం బౌన్సర్లు వేయడంపై ఇర్ఫాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాడు. ఈ కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవడంతో, శనివారం ఆయన మరోసారి స్పందిస్తూ తన కామెంట్లను గట్టిగా సమర్థించుకున్నాడు.

వైభవ్ బ్యాటింగ్ చూస్తుంటే తన సొంత కొడుకు బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించిందని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో బంతి వైభవ్ సూర్యవంశీ తలకు తగలడం చూసి తాను తీవ్రంగా భయపడ్డానని.. ఆ క్షణంలో తనకు దివంగత ఆస్ట్రేలియా బ్యాటర్ ఫిలిప్ హ్యూస్ గుర్తుకు వచ్చాడని ఇర్ఫాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ స్థాయి క్రికెట్‌లో ఆటగాళ్లకు కఠినమైన పరీక్షలు ఎదురవుతాయని, ప్రత్యర్థి జట్లు వ్యూహాలు రచిస్తాయనే విషయంలో ఎలాంటి తప్పు లేదని, అయితే ఒక తండ్రిగా ఆ పిల్లోడి భద్రత గురించి ఆందోళన చెందడం సహజమని ఆయన స్పష్టం చేశాడు.
ఇర్ఫాన్ పఠాన్ ప్రస్తావించిన ఫిలిప్ హ్యూస్ ఉదంతం క్రికెట్ చరిత్రలో ఒక తీరని విషాదం. 2014లో జరిగిన షెఫీల్డ్ షీల్డ్ దేశీవాళీ మ్యాచ్‌లో సౌత్ ఆస్ట్రేలియా తరఫున బ్యాటింగ్ చేస్తున్న 25 ఏళ్ల హ్యూస్.. సీన్ అబాట్ వేసిన బౌన్సర్ తలకు బలంగా తగలడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు. ఆ పాత చేదు జ్ఞాపకం వల్లే వైభవ్ సూర్యవంశీ తలకు బంతి తగలగానే ఇర్ఫాన్ పఠాన్ అంతగా ఆందోళన చెందాల్సి వచ్చింది.
అదే సమయంలో వైభవ్ సూర్యవంశీ ప్రతిభను ఇర్ఫాన్ పఠాన్ కొనియాడాడు. ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. ఇప్పుడు భారత జాతీయ జట్టు తరఫున ఆడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడని ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ సిరాజ్ వంటి దిగ్గజ బౌలర్ల బౌలింగ్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా పరుగులు రాబట్టాడని, ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 లీగ్‌లో తనను తాను నిరూపించుకున్న ఈ వండర్ కిడ్‌కు తిరుగులేదని ఇర్ఫాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications