
టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు రెండో సారి పుత్రోత్సాహం కలిగింది. ఈ మేరకు ఇర్ఫాన్ పఠానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన భార్య సఫా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చినట్లు పేర్కొన్నాడు. అంతే కాకుండా తన కుమారుడికి సులేమాన్ ఖాన్ అని పేరు కూడా పెట్టినట్లు తెలిపాడు. ఈ సందర్భంగా తన ముద్దుల కుమారుడిని చేతిలో పట్టుకోని చిరునవ్వులు చిందిస్తున్న ఫోటోను ఇర్పాన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. తాను, తన భార్య సఫా తమ కుమారుడు సులేమాన్ ఖాన్‌ను ఈ ప్రపంచంలోకి ఆహ్వానించామని, ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని రాసుకొచ్చాడు. అంతేకాకుండా మీ అందరి దీవెనలు కావాలని అభిమానులను కోరాడు. దీంతో ఇర్ఫాపఠాన్‌కు క్రికెటర్లతోపాటు అభిమానులు కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు. కాగా ఇర్ఫాన్‌కు ఇది వరకే ఇమ్రాన్ ఖాన్ పఠాన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అతను 2016 డిసెంబర్ 20న జన్మించాడు.
ఇర్ఫాన్ పఠాన్‌కు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ మోడల్ సఫా బేగ్‌తో 2016 ఫిబ్రవరి 4న వివాహం జరిగింది. అదే ఏడాది వీరికి ఒక మగ బిడ్డ జన్మించాడు. టీమిండియాలో పేస్ ఆల్‌రౌండర్‌గా రాణించిన ఇర్ఫాన్ కెరీర్‌ను గాయాలు దెబ్బగొట్టాయి. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ వరుసగా గాయాలు కావడంతో ఇర్ఫాన్ పఠాన్ సుదీర్ఘ కాలం కెరీర్‌ను కొనసాగించలేకపోయాడు. దీంతో గతేడాదే క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు ఇర్ఫాన్ గుడ్‌బై చెప్పాడు. ప్రస్తుతం క్రికెట్ వ్యాఖ్యాతగా రాణిస్తున్నాడు. అంతే కాకుండా పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా ఉన్నాడు. ఇండియాకు చెందిన మహమ్మదీన్ స్పోర్టింగ్ ఫుట్ క్లబ్‌కు అంబాసిడర్‌గా ఉన్నాడు. అంతేకాకుండా ఇంకొన్ని కంపెనీలకు ఇర్ఫాన్ పఠాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
టీమిండియాలో ఇర్ఫాన్ పఠాన్ మంచి ఆల్‌రౌండర్‌గా రాణించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 29 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన ఇర్ఫాన్.. 31 సగటుతో 1105 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 102 పరుగులు. అంతేకాకుండా 100 వికెట్లు కూడా తీశాడు. 120 వన్డే మ్యాచ్‌ల్లో 23 సగటుతో 1544 పరుగులు చేశాడు. అందులో 5 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అత్యధిక స్కోర్ 83 పరుగులు. అలాగే 173 వికెట్లు పడగొట్టాడు. ఇక 24 టీ20 మ్యాచ్‌లు ఆడి 24 సగటుతో 172 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు 33*. అదే సమయంలో 28 వికెట్లు పడగొట్టాడు. ఇక 103 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడి 21 సగటుతో 1139 పరుగులు చేశాడు. ఒక హాఫ్ సెంచరీ సాధించాడు. అత్యధిక పరుగులు 60. అదే సమయంలో 80 వికెట్లు పడగొట్టాడు.