హైదరాబాద్: తన కుమారుడికి దావూద్, యాకూబ్ లాంటి పేర్లు పెట్టొద్దని ట్విట్టర్‌లో ఓ అభిమాని చేసిన వెటకారపు సూచనకు టీమిండియా ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ హుందాగా స్పందించి అభిమానుల మనసు దోచుకున్నాడు. వివరాల్లోకి వెళితే డిసెంబర్ 22న ఇర్ఫాన్ పఠాన్ భార్య సాఫా బేగ్ మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సంతోషక విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపిన పఠాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీనిపై దివ్యాన్షురాజు అనే అభిమాని స్పందిస్తూ 'బేబి బాయ్ పుట్టినందుకు పెద్ద శుభాకాంక్షలు. ఆ చిన్నారికి దావూద్, యాకూబ్ అనే పేర్లు పెట్టొద్దు సోదరా. హాస్యాస్పదంగా ఉంటుంది'' అంటూ వెటకారంగా మాట్లాడాడు.
ఈ ట్వీట్‌పై కాస్తంత ఇబ్బంది పడ్డ ఇర్ఫాన్ పఠాన్ తన కుమారుడు కూడా నాన్న, పెదనాన్నలాగా దేశానికి మంచి పేరు తీసుకొస్తాడని హుందాగా స్పందించి అభిమానుల మనసు దోచుకున్నాడు. 'దివ్యాన్షుగారు.. పేరు ఏదైనా కానీయండి, ఒక్కటి మాత్రం నిజం. నా కుమారుడు నాన్న, పెదనాన్నలా దేశానికి మంచిపేరు తీసుకొస్తాడు' అని ట్వీట్ చేశాడు.
తన కుమారుడికి 'ఇమ్రాన్ ఖాన్ పఠాన్'గా నామకరణం చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ పేరు తన కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ తర్వాత పఠాన్ ట్వీట్‌కు స్పందించిన దివ్యాన్షు తాను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తనను క్షమించాలని కోరాడు. ఇందుకు పఠాన్ కూడా తనదైన శైలిలో స్పందించాడు.
ఇదిలా ఉంటే ఇటీవలే ఓ మగ బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ జంట సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్‌లు తమ బిడ్డకు తైమూర్ ఖాన్ అని నామకరణం చేయడంతో సోషల్ మీడియాలో అది వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.