హైదరాబాద్: రెండుసార్లు వరల్డ్ కప్ గెలిచిన ఘన చరిత్ర కలిగిన వెస్టిండీస్ 2019లో ఇంగ్లండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్ బెర్తు కోసం చరిత్రలోనే తొలిసారి అర్హత మ్యాచ్‌లు ఆడక తప్పేట్లు లేదు. వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించే క్రమంలో జరిగిన తొలి మ్యాచ్‌లో వెస్టిండిస్‌కు వరుణుడు అడ్డుపడ్డాడు.
క్రిస్ గేల్ పునరాగమనంతో ఈ మ్యాచ్‌లో విజయంపై విండీస్ ఆశలు పెంచుకుంది. ఐర్లాండ్‌తో ఓ వన్డే, ఇంగ్లాండ్‌తో ఐదు వన్డేల సిరీస్ ఆడాల్సి ఉండగా.. ఐర్లాండ్‌తో బుధవారం జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయింది.
ఈ మ్యాచ్‌లో వెస్టిండిస్ విజయం సాధిస్తే, ఇంగ్లండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌లో విండీస్ 4-1తో గెలిస్తే సరిపోయేది. సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్-8లో ఉన్న జట్లకే 2019 ప్రపంచకప్‌లో నేరుగా ఆడే అవకాశం దక్కనుండగా.. ప్రస్తుతానికి వెస్టిండిస్ తొమ్మిదో స్థానంలో ఉంది.
అయితే తాజాగా ఐర్లాండ్‌తో మ్యాచ్ రద్దు కావడంతో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరిస్‌ను 5-0 లేదా 4-0తో ఓడిస్తే తప్ప విండీస్ ఎనిమిదో ర్యాంకులో ఉన్న శ్రీలంకను వెనక్కి నెట్టగలదు. లేదంటే శ్రీలంక నేరుగా ప్రపంచ కప్‌కు క్వాలిఫై అవుతుంది. వచ్చే ఏడాది జింబాబ్వేలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీలో వెస్టిండిస్ ఆడాల్సి ఉంటుంది.