పసికూన కాదు కసికూన.. న్యూజిలాండ్‌ను వణికించిన ఐర్లాండ్.. 361పరుగుల ఛేదనలో జస్ట్ ఒక్క పరుగు తేడాతో..!

ఐర్లాండ్‌లోని డబ్లిన్‌లో ఐర్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన చివరి వన్డే రసవత్తరంగా సాగింది. చివరి వరకు కొదమ సింహాల్లా పోరాడిన ఐర్లాండ్ ప్లేయర్లు.. చివరి బంతికి 1పరుగు తేడాతో ఓడిపోయారు. ఈ మ్యాచ్ చివర్లో నరాలు తెగే ఉత్కంఠతో డ్రామా నడిచింది. 361పరుగుల భారీ లక్ష్యాన్ని ఐర్లాండ్ బ్యాటర్లు అద్భుతంగా ఛేదిస్తూ.. ఒక్క పరుగు తేడాతో మిస్సయ్యారు. అసామాన్య పోరాట పటిమతో వన్డేల్లో అగ్రస్థానంలో ఉన్న న్యూజిలాండ్ లాంటి జట్టును ఐర్లాండ్ వణికించిందనే చెప్పాలి.
ఇక క్రికెట్ ప్రపంచ జట్లకు ఇక తామేమీ పసికూనలం కాదనే హింట్లు కూడా ఈ సిరీస్ ద్వారా ఐర్లాండ్ చాటింది. తొలి వన్డేలో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన గెలిచిన న్యూజిలాండ్.. చివరి వన్డేలోనూ అదే తరహాలో జస్ట్ ఓటమి అంచుల్లో నుంచి గెలిచింది. ఇకపోతే మూడు వన్డేల్లో మూడింట గెలిచిన కివీస్ 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇరు జట్ల మధ్య జూలై 18నుండి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరగబోతుంది.

గప్టిల్ సెంచరీతో చెలరేగడంతో..
ఈ మ్యాచ్ విషయానికొస్తే తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50ఓవర్లలో 6వికెట్లు కోల్పోయి 360పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (115పరుగులు 126బంతుల్లో 15ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీతో మెరిశాడు. ఇక ఫిన్ అలెన్ (33), కెప్టెన్ లాథమ్ (30), హెన్రీ నికోల్స్ (74పరుగులు 54బంతుల్లో 7ఫోర్లు, 3సిక్సర్లు), గ్లెన్ ఫిలిప్స్ (47) రాణించారు. దీంతో న్యూజిలాండ్ స్కోరుబోర్డు పరుగులెత్తింది. జోషువా లిటిల్ 2, యంగ్, డెలనీ, కర్తీస్ క్యాంపర్ తలా ఓ వికెట్ తీశారు.
పాల్ స్టిర్లింగ్, హెర్రీ టెక్టార్ సెంచరీలు
ఇక తర్వాత ఛేదనకు దిగిన ఐర్లాండ్.. అసమాన పోరాటాన్ని కనబర్చింది. 361పరుగుల భారీ లక్ష్య ఛేదనలో 50ఓవర్లకు 359పరుగులు చేసిన కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. ఐర్లాండ్ ఏ దశలోనూ తన పోరాటాన్ని సడల్చలేదు. ఆ జట్టులో పాల్ స్టిర్లింగ్ (120పరుగులు 103బంతుల్లో 14ఫోర్లు, 5సిక్సర్లు), హెర్రీ టెక్టార్ (108పరుగులు 106బంతుల్లో 7ఫోర్లు, 5సిక్సర్లు) సెంచరీలతో చెలరేగడంతో లక్ష్యం అమాంతం కరుగుతూ వచ్చింది. అయితే మిగతా బ్యాటర్లలో ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. చివరి ఓవర్లో 10పరుగులు కావాల్సిన దశలో టిక్నర్ వేసిన బౌలింగ్లో 8పరుగులు మాత్రమే రావడంతో ఐర్లాండ్ త్రుటిలో గెలుపుకు దూరమైంది.

చివరి ఓవర్లో హైడ్రామా
చివరి ఓవర్లో హైడ్రామా నడిచింది. టిక్నర్ వేసిన బౌలింగ్లో వరుసగా ఆరు బంతుల్లో 0, 1, 4, 1 రనౌట్, 1, 1 రన్స్ వచ్చాయి. తద్వారా 10పరుగులకు గాను 8పరుగులే వచ్చాయి. చివరి బంతికి 3పరుగులు అవసరమైన దశలో బ్యాటర్ హ్యుమ్ సింగిల్ మాత్రం తీయడంతో 1పరుగు తేడాతో ఐర్లాండ్ పరాజయం పాలయింది. ఏదేమైనా వన్డేల్లో నంబర్ 1 జట్టును ఎదుర్కొని దాదాపు గెలిచినంత పని చేసిన ఐర్లాండ్ పోరాట స్ఫూర్తి నిజంగా అద్వితీయం అమోఘమనే చెప్పాలి. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 4, సాంట్నర్ 3, టిక్నర్ 1 వికెట్ తీశారు.

ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా మైఖేల్ బ్రేస్ వెల్
ఈ సిరీస్లో న్యూజిలాండ్ తరఫున మైఖేల్ బ్రేస్‌వెల్ తొలి రెండు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌తో హీరోగా నిలిచాడు. అతను మొదటి వన్డేలో సెంచరీని సాధించి చివర్లో మ్యాచ్ గెలిపించగా.. రెండో వన్డేలో 40బంతుల్లో 42 పరుగులు చేసి రాణించాడు. ఇక మూడో మ్యాచ్‌లోనూ చివర్లో కీలకమైన 21పరుగులు చేశాడు. అందువల్ల అతనికి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. ఇక చివరి వన్డేలో సెంచరీ చేసిన గప్టిల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

మ్యాచ్ సమ్మరీ : న్యూజిలాండ్ 360/6, ఐర్లాండ్ 359/9.
తుది జట్లు :
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్, ఆండ్రూ బల్బిర్నీ (కెప్టెన్), ఆండీ మెక్‌బ్రైన్, హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), జార్జ్ డాక్రెల్, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, గారెత్ డెలానీ, గ్రాహం హ్యూమ్
న్యూజిలాండ్ : మార్టిన్ గప్టిల్, ఫిన్ అలెన్, విల్ యంగ్, టామ్ లాథమ్ (కెప్టెన్ & వికెట్ కీపర్), హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్, మాట్ హెన్రీ, బ్లెయిర్ టిక్నర్, లాకీ ఫెర్గూసన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications