టీ20 వరల్డ్ కప్ రన్నరప్ దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల అఫ్గానిస్థాన్ చేతిలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన సౌతాఫ్రికా.. తాజాగా టీ20ల్లో ఐర్లాండ్ చేతిలో తొలి పరాజయాన్ని చవిచూసింది. ఆల్‌రౌండ్ షోతో సత్తాచాటిన ఐర్లాండ్ టీ20ల్లో దక్షిణాఫ్రికాపై మొదటిసారి గెలుపు రుచి చూసింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో పది పరుగుల తేడాతో నెగ్గింది. ఈ చారిత్రక విజయంలో అడైర్ బ్రదర్స్ రాస్-మార్క్ కీలక పాత్ర పోషించారు. ఈ రెండు టీ20ల సిరీస్‌ను ఇరు జట్లు 1-1తో పంచుకున్నాయి.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 195 పరుగులు చేసింది. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఐర్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు. ఓపెనర్ రాస్ అడైర్ శతకంతో చెలరేగాడు. 58 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 5 ఫోర్లు, 9 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఓపెనర్, కెప్టెన్ స్టిర్లింగ్ (52; 31 బంతుల్లో, 7 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకంతో సత్తాచాటాడు. వీరిద్దరి ధాటికి 13 ఓవర్లలో ఐర్లాండ్ 137 పరుగులు చేసింది.

ఐర్లాండ్ జోరు చూస్తుంటే సునాయాసంగా 200+ స్కోరు దాటేలా కనిపించింది. కానీ సౌతాఫ్రికా బౌలర్లు పుంజుకుని క్రమం తప్పకుండా వికెట్లు తీసి స్కోరుబోర్డును కట్టడి చేశారు. ముల్డర్ రెండు వికెట్లు, ఎంగిడి, విలియమ్స్, పాట్రిక్ తలో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 185 పరుగులకే పరిమితమైంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు మినహా ఎవరూ రెండంకెల స్కోరును అందుకోలేదు.
రీజా హెండ్రిక్స్ (51; 32 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్), మాథ్యూ బ్రీట్జ్కి (51; 41 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో, ర్యాన్ రికెల్టన్ (36; 22 బంతుల్లో, 1 ఫోర్, 4 సిక్సర్లు) పరుగులతో పోరాడారు. మార్క్ అడైర్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. 4 ఓవర్లలో 31 పరుగులు ఇచ్చి కీలక బ్యాటర్లను పెవిలియన్‌కు చేర్చాడు. గ్రహమ్ మూడు వికెట్లు సాధించాడు. అబుదాబి వేదికగానే బుధవారం నుంచి ఐర్లాండ్-దక్షిణాఫ్రికా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.