చెన్నై సూపర్ కింగ్స్ కొత్త సారథిగా రుతురాజ్ గైక్వాడ్ బాధ్యతలు తీసుకున్నాడు. దిగ్గజ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ స్థానంలో రుతురాజ్ జట్టు పగ్గాలు అందుకున్నాడు. కానీ సీఎస్‌కే అభిమానుల నుంచి రుతురాజ్‌కు ఎలాంటి వ్యతిరేకత రాలేదు. కానీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై తీవ్ర దుమారం రేగింది.
రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయాన్ని కొందరు క్రికెటర్లు ఏకీభవించగా, మరికొందరు విభేదించారు. అయితే ఈ విషయాన్ని రోహిత్ శర్మ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. అయిదు టైటిళ్లు అందించిన సారథిని, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్‌ను ఎలా తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు.

అంతేగాక హార్దిక్ పాండ్యను లక్ష్యంగా చేసుకుని దారుణంగా విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలోనే కాకుండా బయటా హార్దిక్‌ను రోహిత్ ఫ్యాన్స్ వదలట్లేదు. హార్దిక్ ఎక్కడ కనిపించినా 'రోహిత్ రోహిత్' అంటూ నినాదాలు చేస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ దారుణమైన అవమానాన్ని ఎదుర్కొన్నాడు.
గుజరాత్ టైటాన్స్‌ను వీడటంతో గుజరాత్ అభిమానులు, ముంబై పగ్గాలు అందుకోవడంతో రోహిత్ అభిమానులు కలిసి హార్దిక్‌ను హేళన చేశారు. హార్దిక్ టాస్‌కు వచ్చిన సమయంలో..రోహిత్ నినాదాలతో స్టేడియం మార్మోగింది. దీనిపై విదేశీ మాజీ క్రికెటర్లు సైతం ఆశ్చర్యపోయారు. అయితే గుజరాత్-ముంబై మ్యాచ్‌లో మరో ఘోరమైన అవమానాన్ని హార్దిక్ ఎదుర్కొన్నాడు.
మ్యాచ్ మధ్యలో సిబ్బందిని దాటుకుని మైదానంలోకి ఓ కుక్క వచ్చింది. అది గ్రౌండ్‌లో అటూ ఇటూ పరిగెత్తితింది. ఆ సమయంలో కుక్కను హార్దిక్‌తో పోలుస్తూ.. హార్దిక్ హార్దిక్ అంటూ స్టేడియంలోని ప్రేక్షకులు అరిచారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా, కెప్టెన్సీ తీసుకున్నందుకు హార్దిక్‌ను మరీ ఇంతలా అవమానించాలా? పాపం హార్దిక్.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే..ముంబైపై గుజరాత్ టైటాన్స్ ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (45; 39 బంతుల్లో), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (31; 22 బంతుల్లో) రాణించారు. అనంతరం ఛేదనలో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 162 పరుగులే చేసింది. బ్రెవిస్ (46; 38 బంతుల్లో), రోహిత్ శర్మ (43; 29 బంతుల్లో) పోరాడారు.