
పేలవ ఆరంభం
సాదారణ లక్ష్య ఛేదనను చెన్నై పేలవంగా ఆరంభించింది. పవర్‌ప్లే ముగిసేలోపే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. నాలుగో ఓవర్లో ఫాఫ్ డుపెస్లిస్ (8) క్రిస్ మోరీస్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఐదో ఓవర్లో ప్రమాదకర షేన్ వాట్సన్ (14) బౌల్డ్ అయ్యాడు. బౌండరీ బాది మంచి ఊపులో ఉన్న వాట్సన్.. ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు. ఆపై స్కోర్ వేగం బాగా తగ్గిపోయింది. చెన్నై ఆటగాళ్లు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. దీంతో 10 ఓవర్లకు చెన్నై స్కోరు 47/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడు, జగదీశన్ బెంగళూరు బౌలర్లను ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.

ఆశలు రేపిన రాయుడు
రాయుడు, జగదీశన్ మూడో వికెట్‌కు 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై శిబిరంలో ఆశలు రేపారు. అయితే సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. 14.2వ బంతికి పరుగు తీస్తున్న జగదీశన్‌ను మెరుపు త్రోతో మోరిస్ ఔట్ చేశాడు. 15.6వ బంతికి ఎంఎస్ ధోనీని చహల్ ఔట్ చేశాడు. అప్పటికి చెన్నై స్కోరు 106/4. మరికాసేపటికే కరన్ (0)ను మోరిస్, రాయుడుని ఉదాన పెవిలియన్ పంపించడంతో చెన్నై ఓటమి ఖరారైంది. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో రవీంద్ర జడేజా (7), డ్వేన్ బ్రావో (7), దీపక్ చహర్ (5), శార్దూల్ ఠాకూర్ (1) ఏమీ చేయలేకపోయారు.

సింగిల్స్‌కే పరిమితం
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నాలుగు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరు ఇన్నింగ్స్ మొదట్లో చప్పగా సాగింది. జట్టు స్కోరు 13 వద్దే ఆరోన్ ఫించ్ (2) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టమైన బంతులు వేయడంతో విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ కేవలం సింగిల్స్‌కే పరిమితం అయ్యారు. దాంతో 10 ఓవర్లకు బెంగళూరు 65/1తో నిలిచింది. ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్ వేసిన 12వ ఓవర్లో పడిక్కల్, ఏబీ డివిలియర్స్ (0) ఔటయ్యారు. మరికాసేపటికే వాషింగ్టన్ సుందర్ (10; 10 బంతుల్లో 1×6) పెవిలియన్‌కు చేరడంతో 16 ఓవర్లకు బెంగళూరు 103/4తో నిలిచింది.

కోహ్లీ దూకుడు
ఓ దశలో బెంగళూరు 140 పరుగులైనా చేస్తుందా అనిపించింది. అయితే 17వ ఓవర్లో బౌండరీతో అర్ధ శతకం అందుకున్న విరాట్ కోహ్లీ ఆ తర్వాత విధ్వంసం సృష్టించాడు. తనలోని వినూత్న షాట్లనూ బయటకు తీశాడు. శివమ్ దూబెతో కలిసి చెదిరే సిక్సర్లు, బౌండరీలు బాదాడు. వీరిద్దరూ 18వ ఓవర్లో 24, 19వ ఓవర్లో 14, 20 ఓవర్లలో 14 పరుగులు చేశారు. దాంతో బెంగళూరు స్కోరు 169/4కి చేరుకుంది. ఇద్దరూ చివరి 5 ఓవర్లలో 74 పరుగులు బాదారు. చెన్నైలో శార్దూల్ ఠాకూర్ 2.. కరన్, చహర్ తలో వికెట్ తీశారు.


Click it and Unblock the Notifications












