
దుబాయ్: తమ జట్టు బ్యాటింగ్ తీరుపైనే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ట్విటర్ హ్యాండిల్ సెటైర్ వేసుకుంది. నిదానంగా సాగుతున్న తమ జట్టు ఇన్నింగ్స్ చూసి.. పాసిటివిటీ (సానుకూలం) కాప్షన్ ఇచ్చింది. దానికి ఓ మూడు లవ్ ఎమోజిలను కూడా జతచేసి అభిమానులతో పంచుకుంది. అంతేకాదు.. తలపై కండువా, మస్తుగా బ్యాటింగ్ చేస్తున్నావ్ అన్నట్టు ఉండే ఓ వ్యక్తి ఫొటోను షేర్ చేసింది. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. అభిమానులు కూడా తమదైన స్టయిల్లో కామెంట్లు కురిపిస్తున్నారు.మీమ్‌లు పోస్ట్ చేస్తున్నారు.
బ్యాటింగ్ వైఫల్యంతో చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ఓడింది. ఐపీఎల్-13లో శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. 170 పరుగుల ఛేదనలో బెంగళూరు బౌలర్లు వాషింగ్టన్ సుందర్ (2/16), క్రిస్ మోరీస్( 3/19)ల ధాటికి చెన్నై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులే చేసింది. తెలుగు తేజం అంబటి రాయుడు (42: 40 బంతుల్లో 4ఫోర్లు), తమిళనాడు యువ ఆటగాడు ఎన్ జగదీశన్ (33: 28 బంతుల్లో 4ఫోర్లు) మినహా మిగతా బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో చెన్నై భారీ మూల్యం చెల్లించుకుంది.
లక్ష్య ఛేదనను చెన్నై పేలవంగా ఆరంభించింది. ఓపెనర్లు షేన్ వాట్సన్, ఫాఫ్ డుప్లెసిస్ ధాటిగా ఆడలేకపోయారు. బెంగళూరు బౌలర్ల ధాటికి పవర్‌ప్లే ముగిసేలోపే ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. నాలుగో ఓవర్లో డుపెస్లిస్ (8) క్రిస్ మోరీస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగ్గా.. ఐదో ఓవర్లో వాట్సన్(14) బౌల్డ్ అయ్యాడు. ఆపై స్కోర్ వేగం బాగా తగ్గిపోయింది. చెన్నై ఆటగాళ్లు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. దీంతో 10 ఓవర్లకు చెన్నై స్కోరు 47/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో రాయుడు, జగదీశన్ బెంగళూరు బౌలర్లను ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో బ్యాట్స్‌మెన్ తీవ్ర ఒత్తిడిలో పడ్డారు. లక్ష్యం దిశగా సాగుతున్న సమయంలో సైనీ వేసిన 15వ ఓవర్లో జగదీశన్ వికెట్ల మధ్య నిర్లక్ష్యంగా పరుగెత్తి రనౌటయ్యాడు.
ఈ దశలో కెప్టెన్ ఎంఎస్ ధోనీ (10) అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. 30 బంతుల్లో 74 పరుగులు చేయాల్సిన సమయంలో చహల్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన మహీ..ఆ ఓవర్ ఆఖరి బంతికే లాంగాఫ్‌లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రిస్ మోరీస్ వేసిన తర్వాతి ఓవర్ రెండో బంతికే శామ్ కరన్ (0) వికెట్ కీపర్ క్యాచ్‌కు ఔటయ్యాడు. ఒంటరి పోరాటం చేస్తున్న రాయుడు కూడా ఉడాన బౌలింగ్‌లో బంతిని వికెట్ల మీదకు ఆడుకొని పెవిలియన్ చేరాడు. డ్వేన్ బ్రావో (7), జడేజా (7) రెచ్చిపోయే ప్రయత్నం చేసినా.. మోరీస్ వెనువెంటనే పెవిలియన్ పంపి చెన్నై కథ ముగించాడు.