మరో పది రోజుల్లో ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లోనూ టైటిల్ సాధించాలని డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పట్టుదలతో బరిలోకి దిగుతోంది. కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఈసారి స్టైలిస్ లుక్‌తో వస్తున్నాడు. జులపాలతో కెరీర్ ఆరంభించిన ధోనీ ఇప్పుడు మరోసారి అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు.
అయితే ఎప్పటిలానే ఐపీఎల్‌లో ధోనీకి ఇదే ఆఖరి సీజన్ అనే చర్చ, ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఒకవేళ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికితే సీఎస్‌కేను నడిపించేది ఎవరనేది అసలు ప్రశ్న. గతంలో జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అందించినా ఫలితం లేకపోయింది. సారథిగా జడ్డూ ఆకట్టుకోలేకపోయాడు. మరోవైపు ఐపీఎల్-2025కు ముందు మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ పరంగా ధోనీ వారసుడిని ఈ సీజన్‌లో చెన్నై ఫ్రాంచైజీ తప్పక వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వేలంలో ఆటగాడిని కొనుగోలు చేసి, ఆ తర్వాత అతడికి కెప్టెన్సీ పగ్గాలు అందివ్వాలని సాధారణంగా ఏ ఫ్రాంచైజీ భావించదు. అందుకే రిటైన్ చేసుకునే ఆటగాళ్లలోనే నాయకుడిని ఎంచుకుంటుంది. అయితే ధోనీ తర్వాత కెప్టెన్ ఎవరనే ప్రశ్నకు చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ బదులిచ్చాడు. భవిష్యత్‌లో సారథి ఎవరనే విషయం గురించి సీఎస్‌కే యజమాని శ్రీనివాసన్ చాలా స్పష్టతతో ఉన్నాడని తెలిపాడు.
''కెప్టెన్ విషయంపై అంతర్గత చర్చలు జరిగాయి. దీనిపై శ్రీనివాసన్ చాలా క్లియర్‌గా ఉన్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్ వంటి విషయాలను కోచ్, ప్రస్తుత సారథికి వదిలేయాలి. వాళ్లు నిర్ణయించుకున్న తర్వాత నాకు ఆ సమాచారాన్ని అందిస్తారు. ఆ తర్వాత మీకు నేను తెలియజేస్తాను. అప్పటివరకు మనం ఈ విషయం గురించి మాట్లాడకపోవడమే మంచిది''
''ప్రస్తుతం నాకౌట్స్‌కు అర్హత సాధించడంపై దృష్టిసారించాం. అదే మా మొదటి లక్ష్యం. ఆ తర్వాత ఆ రోజు ప్రదర్శనపై ఆధారపడి ఉంటుంది. గత కొన్నాళ్లుగా ఇదే అనుసరిస్తున్నాం. 'తొలుత లీగ్ మ్యాచ్‌లపై ఫోకస్ చేద్దాం. నాకౌట్స్ క్వాలిఫై కావడానికి ట్రై చేద్దాం' అని ప్రతి సీజన్ ప్రారంభానికి ముందు ధోనీ.. జట్టుతో ఇదే చెబుతుంటాడు. జట్టుపై ఒత్తిడి ఉంటుంది. గత కొన్నాళ్లుగా నిలకడైన ప్రదర్శన చేస్తున్న కారణంగా ఆటగాళ్లపై ఒత్తిడి సహజం'' అని విశ్వనాథన్ పేర్కొన్నాడు.