IPL vs PSL: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టుపై సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన సెంచరీ సాధించాడు. 246 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అభిషేక్ శర్మ ఒంటి చేత్తో జట్టును గట్టెక్కించాడు. ఈ క్రమం ఐపీఎల్ ఉత్సాహం కొనసాగుతుండగా.. పాకిస్తాన్ సూపర్ లీగ్ లో కూడా ఓ అద్భుతం జరిగింది. పాకిస్తాన్ వైట్ బాల్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో అద్భుతమైన సెంచరీ సాధించాడు.
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025లో భాగంగా శనివారం(ఏప్రిన 12) రోజున ముల్తాన్ సుల్తాన్స్, కరాచీ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కరాచీ కింగ్స్ మొదట ముల్తాన్ సుల్తాన్స్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. ముల్తాన్ సుల్తాన్స్ జట్టు కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు. కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో రిజ్వాన్ అజేయంగా 105* పరుగులు చేశాడు. రిజ్వాన్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి.

ముల్తాన్ సుల్తాన్స్ జట్టుకు బ్యాటింగ్ లో గొప్ప ఆరంభం లభించింది. మహ్మద్ రిజ్వాన్, షాయ్ హోప్ తొలి 5 ఓవర్లలో 55 పరుగులు జోడించారు. క్రీజులోకి వచ్చిన వెంటనే మహ్మద్ రిజ్వాన్ బౌండరీ బాదడం ప్రారంభించగా.. షాయ్ హోప్ స్ట్రైక్ ను తిప్పడంపై దృష్టి పెట్టాడు. ఆరో ఓవర్ తొలి బంతికే హసన్ అలీ షాయ్ హోప్ ను ఔట్ చేశాడు. షాయ్ హోప్ 8 పరుగులు చేశాడు. అనంతరం మహ్మద్ రిజ్వాన్ ఉస్మాన్ ఖాన్ తో కలిసి 27 పరుగుల భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. ఉస్తాన్ ఖాన్ 15 బంతుల్లో 19 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్, కమ్రాన్ గులాం కలిసి 63 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
కమ్రాన్ గులాం 19 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 36 పరుగులు చేశాడు. 15వ ఓవర్లో అబ్బాస్ అఫ్రిది అతడిని ఔట్ చేశాడు. ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్ మైఖేల్ బ్రేస్‌వెల్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించాడు. వీరిద్దరూ కలిసి కేవలం 32 బంతుల్లో 89 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు. బ్రేస్‌వెల్ 17 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. బ్రేస్‌వెల్ 5 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. కరాచీ కింగ్స్ బౌలర్లలో హసన్ అలీ, అబ్బాస్ అఫ్రిది, ఖుష్దీల్ షా తలా ఒక వికెట్ పడగొట్టారు.
కానీ ముల్తాన్ సుల్తాన్స్.. కరాచీ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. అనంతరం 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కరాచీ కింగ్స్ 19.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్లలో జేమ్స్ విన్స్(101), ఖుష్దిల్ షా(60) అద్భుతంగా రాణించడంతో కరాచీ కింగ్స్ విజయాన్ని సాధించింది. 4 వికెట్ల తేడాతో కరాచీ కింగ్స్ జట్టు గెలుపొందింది. మహ్మద్ రిజ్వాన్ చేసిన సెంచరీ వృథా అయింది.