రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి అదరగొట్టాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కళ్లుచెదిరే సిక్సర్లు, సొగసైన బౌండరీలతో శతక్కొట్టాడు. 72 బంతుల్లో అజేయంగా 113 పరుగులు చేశాడు. 12 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌లో కోహ్లికి ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.
అయితే శతకం సాధించిన కోహ్లిపై నెట్టింట విమర్శలు వస్తున్నాయి. సెల్ఫిష్ అంటూ కోహ్లిని విమర్శిస్తున్నారు. 12 ఓవర్లు ఆడిన కోహ్లి.. స్లో ఇన్నింగ్స్ ఆడాడని పోస్ట్‌లు వెల్లువెత్తున్నాయి. మరోవైపు ఆర్సీబీ అభిమానులు కోహ్లి ఇన్నింగ్స్‌ను కొనియాడుతున్నారు. ఆర్సీబీ మిగిలిన బ్యాటర్లు 48 బంతుల్లో 59 పరుగులే చేశారని మ్యాచ్ గణంకాలు చూపుతూ విరాట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

కాగా, విరాట్ కోహ్లి అరుదైన రికార్డులతో పాటు కోరుకోని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్‌లో స్లోయెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా మనీష్ పాండే సరసన కోహ్లి నిలిచాడు. 2009 ఆర్సీబీ తరఫున మనీష్ పాండే డెక్కన్ ఛార్జర్స్‌పై 67 బంతుల్లో శతకం బాదాడు. రాజస్థాన్ రాయల్స్‌పై కోహ్లి కూడా ఇవాళ 67 బంతుల్లోనే మూడంకెల స్కోరు అందుకున్నాడు. వీరిద్దరు ఆర్సీబీ తరఫునే సాధించడం గమనార్హం.
ఐపీఎల్‌లో నెమ్మదిగా సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో మనీష్ పాండే (67), విరాట్ కోహ్లి (67), సచిన్ టెండూల్కర్ (66), డేవిడ్ వార్నర్ (66), బట్లర్ (66) టాప్-5లో ఉన్నారు. మరోవైపు కోహ్లి అరుదైన ఘనత కూడా సాధించాడు. మెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన మూడో క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. క్రిస్ గేల్ (22), బాబర్ అజామ్ (11), విరాట్ కోహ్లి (9), ఆరోన్ ఫించ్ (8) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.
కాగా, ఆర్సీబీ క్రేజీ రికార్డు సాధించింది. మెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన జట్టుగా నిలిచింది. ఇవాళ కోహ్లి శతకంతో బెంగళూరు జట్టు ఖాతాలో 18 సెంచరీలు చేరాయి. రెండో స్థానంలో టీమిండియా ఉంది. భారత్ తరఫున 17 సెంచరీలు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో పంజాబ్ కింగ్స్ (14), రాజస్థాన్ రాయల్స్ (14), సోమ్రెస్ట్ (13) జట్లు ఉన్నాయి.