బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్-9 ఫైనల్లో విజయం సాధించి తొలిసారి టైటిల్ సొంతం చేసుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు రన్నరప్‌గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభినందనలు తెలిపాడు. అంతేగాక, హైదరాబాద్ జట్టు అద్భుత బౌలింగ్‌తో ట్రోఫీ సొంతం చేసుకుందని అన్నాడు.
టోర్నీ మొదటి నుంచి హైదరాబాద్ జట్టు బౌలింగ్‌పైనే ఆధారపడిందని అన్నాడు. అయితే బ్యాటింగ్ విభాగంలోనూ ఆటగాళ్లు ఆశించినంత రాణించడంతో ఆ జట్టుకు ఎదురులేకుండాపోయిందని అన్నాడు.
కాగా, ఫలితాలతో సంబంధం లేకుండా తమకు మద్దతుగా నిలిచిన బెంగళూరు అభిమానులకు కోహ్లీ ధన్యవాదాలు తెలిపాడు. తాను, ఏబి డివిలియర్స్ త్వరగా ఔటవడంతోనే తమ జట్టు ఓటమిపాలు కావాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

'ఈ సీజన్లో మా ఆట చాలా బాగుంది. అందుకు నేను గర్వపడుతున్నా. బెంగళూరు ప్రజలు మా జట్టుకు అన్నివేళలా మద్దతుగా నిలిచారు. ఫలితాలతో సంబంధం లేకుండా వారు మమ్మల్ని అభిమానించారు. ఫైనల్లో వికెట్లు పడుతున్నా దూకుడు తగ్గలేదు. కానీ, నేను, ఏబి డివిలియర్స్ ఔటవడంతో ప్రత్యర్థి జట్టు పైచేయి సాధించింది. ఏబి డివిలియర్స్, నేను కాసేపు క్రీజులో ఉండివుంటే ఫలితం మరోలా ఉండేది' అని కోహ్లీ తెలిపాడు.
ఐపిఎల్లో అత్యధికంగా 973 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ అందుకోవడంపై ప్రశ్నించగా..'ఇదొక అదనపు ప్రోత్సాహకం. మేము విజేతలై ఉంటే ఈ ఆనందం రెట్టింపుగా ఉండేది. హైదరాబాద్ పటిష్టమైన బౌలింగ్‌తో మా జట్టును కట్టడి చేసింది. నేను జట్టు విజయం కోసమే పరుగులు చేశాను. రికార్డులనేవి బ్రేక్ కావాల్సిందే'అని కోహ్లీ పేర్కొన్నాడు.
నాలుగు శతకాలపై స్పందిస్తూ.. 'నాకు నేనే ఆశ్చర్యపోయా. ఓపెనింగ్‌లో రావడం వల్లే ఇది సాధ్యమైంది. 3 లేదా 4 స్థానాల్లో వచ్చివుంటే ఇవి సాధ్యమయ్యేవి కాకపోవచ్చు. అలాగే అత్యధిక సిక్సులు బాదడం కూడా నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఈ అవార్డు అందుకున్నందుకు ఆనందంగా ఉంది. ఇక నేను ఎక్కువగా మాట్లాడదల్చుకోలేదు. ఎందుకంటే ఐపిఎల్ విజేత అయిన జట్టు మాట్లాడాలి' అని తెలిపాడు.