హైదరాబాద్: ఐపీఎల్ 10వ సీజన్ పండుగ కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో సందడి చేసేందుకు క్రికెటర్ల ఎమోజీలు అందుబాటులోకి వచ్చేశాయి. క్రికెట్ అభిమానుల కోసం ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్ ద్వారా వీటిని విడుదల చేశారు.
'ఫ్యాన్ అలర్ట్' అంటూ ఐపీఎల్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ల ఎమోజీలు మీకోసం అంటూ ఐపీఎల్ నిర్వాహకులు ట్విటర్‌లో క్రికెటర్ల ఎమోజీలతో కూడిన వీడియోని పోస్టు చేశారు. స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, సురేశ్ రైనా, స్టీవ్ స్మిత్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్‌తో పాటు మరికొందరు ఆటగాళ్ల ఎమోజీలు ఉన్నాయి.
మరోవైపు బుధవారం ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ప్రారంభోత్సవానికి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే తొలి మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తొలి మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలను ఘనంగా జరగనున్నాయి. సాయంత్రం 6.30 గంటలకు జరిగే ఈ వేడుకల్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ అమీ జాక్సన్ తన డ్యాన్స్‌తో సందడి చేయనుంది.

ఆరు నిమిషాలపాటు జరిగే ప్రదర్శనలో అమీ స్టేజ్‌ను హీటెక్కించనుంది. బాలీవుడ్ హిట్ సాంగ్స్ తమ్మ తమ్మ, లెట్స్ నాచో, కర్ గయీ చుల్లా, కాలా చష్మా లాంటి పాటలకు డ్యాన్స్ చేయనుంది. మంగళవారం ఆమె రిహార్సల్స్ కూడా చేసింది. మూడు వందల మంది కళాకారులతో కలిసి అమీ జాక్సన్ సందడి చేయనుంది.
రాష్ట్ర సంస్కృతిని తెలిపే నృత్య రూపకాలను ప్రదర్శించే అవకాశం ఉంది. కాగా, ఓవరాల్‌గా ఉప్పల్‌లో 21 నిమిషాల పాటు ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు.