న్యూఢిల్లీ: ఢిల్లీలోని లోథా కమిటీ కార్యాలయంలో దొంగలు పడ్డారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫిక్సింగ్ కేసు వ్యవహారంలో విచారణ కోసం సుప్రీంకోర్టు.. జస్టిస్ ఆర్ఎం లోథా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ కమిటీ తన నిర్ణయాలు ప్రకటించింది కూడా.
కాగా, వసంత్ కుంజ్‌లో ఉన్న ఆ కమిటీ కార్యాలయంలో కొంత నగదు, ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్ విచారణకు సంబంధించిన కొన్ని పత్రాలను దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు.

కార్యాలయం తాళం పగిలిపోయి ఉండటం గమనించిన సెక్యూరిటీ గార్డు ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. వారి ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఆరంభించారు.
అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, వాటిని పరిశీలిస్తున్నారు. కాగా, అంతర్గత విచారణ కూడా జరపాలని పోలీసులు ఆదేశించారు. అయితే కార్యాలయంలో పోయిన సొత్తు ఎంతో ఖచ్చితంగా తెలియరాలేదు.