న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో నిషేధానికి గురైన పేసర్ శ్రీశాంత్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ఐదు నిమిషాల్లో తన జీవితాన్ని మార్చేసిందని అన్నాడు. తనకు బిసిసిఐ న్యాయం చేయలేదని అన్నాడు. అయితే ఈ విషయంపై తాను స్పందించేందుకు ఆసక్తిగా లేనని చెప్పాడు.
ఈ విషయంపై స్పందించి తాను ఇంకా ఎక్కువమందిని శత్రువులను చేసుకోలేనని తెలిపాడు. అయితే కోర్టు మాత్రం తనను దోషిగా ప్రకటించలేదని స్పష్టం చేశాడు. కొందరికి క్లీన్ చిట్ రావడం పట్ల తనకు బాధేమీ లేదని చెప్పాడు. తాను తన గురించి, తన క్రికెట్ గురించి మాత్రమే ఆలోచిస్తానని చెప్పాడు. తాను తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాల్లేవని.. ఉంటే అది కోర్టులో తేలుతుందని తెలిపాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్‌పై విచారణ జరిపిన ముద్గల్ కమిటీ.. ఇందులో భారత క్రికెట్ మండలికి చెందిన పలువురు కీలక అధికారులున్నట్లు తేల్చిన విషయం తెలిసిందే. కాగా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్, ఐపిఎల్ సహ యజమాని సుందర్ రామన్‌కు బిసిసిఐ క్లీన్‌చిట్ ఇచ్చిన తర్వాతి రోజే కోర్టు వారిని తమ పర్యవేక్షణలో ఉండాలని ఆదేశించింది. శ్రీనివాసన్ అల్లుడు చెన్నై సూపర్ కింగ్స్ అధికారి అయిన గురునాథ్ మేయప్పన్‌కు వ్యతిరేకంగా కూడా బిసిసిఐ స్పందించలేదు.
అయితే రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో పోలీసులు ఛార్జీషీటు నమోదు చేయడంతో బిసిసిఐ నిషేధం విధించింది. ఆ కేసు కోర్టు పరిశీలనలో ఉంది. కాగా, ఈ నేపథ్యంలో పేసర్ శ్రీశాంత్‌పై బిసిసిఐ జీవిత కాల నిషేధాన్ని విధించింది.

తనకు గాడ్ ఫాదర్ ఎవరూ లేనందునే బిసిసిఐ తనపై జీవితకాల నిషేధాన్ని విధించగలిగిందని, తన భవిష్యత్‌ను ఐదు నిమిషాల్లో తేల్చేశారని ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీశాంత్ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను మీడియా ద్వారానే నిషేధం విధించిన విషయాన్ని తెలుసుకున్నాని చెప్పాడు. ఎంతో ఆశ్చర్యానికి గురయ్యానని తెలిపాడు. మళ్లీ వాళ్ల దగ్గరికి వెళ్లాలని అనుకోలేదని చెప్పాడు. తాను నేరానికి పాల్పడ్డట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఇప్పటి వరకు తనపై ఉన్న ఆరోపణలు నిరూపణ కాలేదని తెలిపాడు.
తాను టీమిండియాకి ఆడాలని ఆందోళన చెందడం లేదని చెప్పాడు. తాను కనీసం కేరళ జట్టు తరపునైనా ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. తాను నమ్మకమైన క్రికెట్ ఆటను ప్రేమిస్తానని తెలిపాడు. త్వరలో అన్ని విషయాలు బయటికి వస్తాయి, దాని కోసమే తాను ఎదురుచూస్తున్నాని చెప్పాడు. తాను తన క్రికెట్‌ను తిరిగి కోరుకుంటున్నానని తెలిపాడు. తాను 31-32ఏళ్ల మధ్య ఉన్నానని, తనకు ఇంకో ఐదారేళ్లు ఆట మిగిలి ఉందని చెప్పాడు.
ఫిక్సింగ్ ఆరోపణలు రావడం, నిషేధానికి గురికావడంతో తాను ఎన్నో అవమానాలకు గురైనట్లు తెలిపాడు. ఇవన్నింటికన్నా క్రికెట్ ఆటకు దూరమవడమే తనను బాధించిందని చెప్పాడు. తన ఇంటికి 500 మీటర్ల దూరంలోని కొచ్చి మైదానంలో కూడా ఇప్పటి వరకు అడుగుపెట్టలేదని తెలిపాడు. ఇదే తనను బాధిస్తోందని చెప్పాడు.
తనకు సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు శ్రీశాంత్ తెలిపాడు. ఈ కేసులో తనను సహ నిందితుడిగానే పేర్కొన్నారని చెప్పాడు. ఛార్జీషీటులో తనకు వ్యతిరేకంగా ఏమీ లేదని చెప్పాడు. జనవరి 13న తన న్యాయవాది కోర్టులో వాదిస్తారని చెప్పాడు. తాను స్వచ్ఛంగా ఈ కేసు నుంచి బయటికి వస్తాననే నమ్మకం ఉందని శ్రీశాంత్ తెలిపాడు. తన వ్యక్తిగత జీవితంపై స్పందిస్తూ.. త్వరలోనే తండ్రిని కాబోతున్నానని చెప్పాడు.