ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున మెరుపులు మెరిపించిన ప్రియాన్ష్ ఆర్య ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో దుమ్ము రేపుతున్నాడు. ప్రియాన్ష్ ఆర్య డీపీఎల్‌లో ఔటర్ ఢిల్లీ వారియర్స్ తరఫున ఆడుతున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025లో 12వ మ్యాచ్ అభిమానులకు గొప్ప థ్రిల్‌ను అందించింది. ఈ మ్యాచ్‌లో ప్రియాన్ష్ ఆర్య చేసిన మెరుపు సెంచరీ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచినా.. అతని జట్టు ఓడిపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో చివరి వరకు పోరాటం కొనసాగింది. ఇరు జట్లు కూడా 200 పరుగుల మార్కును దాటడం విశేషం.
ప్రియాన్ష్ ఆర్య అద్భుత సెంచరీ
ఈ మ్యాచ్‌లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఔటర్ ఢిల్లీ వారియర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఔటర్ ఢిల్లీ వారియర్స్ ముందుగానే కొన్ని వికెట్లు కోల్పోయినా, ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య క్రీజులో నిలదొక్కుకుని అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ప్రియాన్ష్ ఆర్య కేవలం 56 బంతుల్లో 9 సిక్సర్లు, 7 ఫోర్లతో 111 పరుగులు చేసి సెంచరీ సాధించాడు. అతనికి తోడుగా కరణ్ గార్గ్ (24 బంతుల్లో 43 పరుగులు) మంచి సహకారం అందించాడు.దీంతో, ఔటర్ ఢిల్లీ వారియర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 231 పరుగుల భారీ స్కోరు సాధించింది.

లక్ష్యఛేదనలో అనుజ్ రావత్ విధ్వంసం
232 పరుగుల కష్టతరమైన లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్టుకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 13 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అంకిత్ రాణా (79 పరుగులు), కెప్టెన్ అనుజ్ రావత్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.ముఖ్యంగా కెప్టెన్ అనుజ్ రావత్ క్రీజులో తుఫానులా మారి సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 35 బంతుల్లో 9 భారీ సిక్సర్లు, 2 ఫోర్లతో 84 పరుగులు చేసి మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేశాడు. అనుజ్ రావత్ మెరుపు ఇన్నింగ్స్ తర్వాత, మయాంక్ రావత్ (12 బంతుల్లో 32 పరుగులు) వేగంగా పరుగులు చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ జట్టు 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది.
ప్రియాన్ష్ సెంచరీ వృథా
ఈ మ్యాచ్‌లో ఔటర్ ఢిల్లీ ప్లేయర్ ప్రియాన్ష్ ఆర్య అద్భుతమైన సెంచరీ చేసినప్పటికీ జట్టు ఓటమి పాలవడంతో అది వృధా అయింది.ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ కెప్టెన్ అనుజ్ రావత్ చూపిన కెప్టెన్సీ ఇన్నింగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈస్ట్ ఢిల్లీ జట్టు చేసిన 235 పరుగుల చేజింగ్, ఢిల్లీ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక చేజింగ్ స్కోరుగా రికార్డు సృష్టించింది.