ముంబై: రాజస్థాన్ రాయల్స్(ఆర్ఆర్) ఆటగాడు అజిత్ చండీలాపై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బిసిసిఐ) జీవితకాలంపాటు నిషేధం విధించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అవినీతికి పాల్పడినట్లు రుజువు కావడంతో బిసిసిఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
బిసిసిఐ అవినీతి వ్యతిరేక నియమాలను ఉల్లంఘించిన ముంబైకి చెందిన మరో క్రికెటర్ హికెన్ షాపై ఐదేళ్లపాటు నిషేధం విధించినట్లు సోమవారం ప్రకటించింది. 'అజిత్ చండీలాపై అన్ని క్రికెట్ ఫార్మాట్లలో ఆడకుండా జీవితం కాలంపాటు నిషేధం విధించాం' అని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపారు.
'హికెన్ షాపై ఐదేళ్లపాటు నిషేధం విధించింది. ఐదేళ్లపాటు అన్ని ఫార్మాట్లలో ఇతడు ఆడేందుకు అనుమతి ఉండదు' అని ఆయన చెప్పారు.

బిసిసిఐ నుంచి వెలువడిన పూర్తి ప్రకటన
అజిత్ చండీలాపై జీవితకాలంపాటు నిషేధం, హికెన్ షాపై ఐదేళ్లపాటు నిషేధం విధించినట్లు బిసిసిఐ క్రమశిక్షణా కమిటీ ముంబైలోని కార్యాలయంలో ఈ మేరకు ప్రకటించింది.
1. అజిత్ చండీలా: ఇతడు బిసిసిఐ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించాడు. అంతేగాక అవినీతికి పాల్పడినట్లు రుజువు అయ్యింది. బిసిసిఐ అవినీతి వ్యతిరేక కోడ్ ఆర్టికల్స్ 2.1.1, ఆర్థికల్ 2.1.2, ఆర్టికల్ 2.1.3, ఆర్టికల్ 2.1.4, ఆర్టికల్ 2.2.2, ఆర్టికల్ 2.2.3, ఆర్టికల్ 2.4.1లను ఇతడు ఉల్లంఘించాడు.
బిసిసిఐ, అనుబంధ సంస్థలు నిర్వహించే ఏ క్రికెట్ ఫార్మాటోనైనా అజిత్ చండీలా జీవితకాలంపాటు ఆడేందుకు వీలులేదు.
2. హికెన్ షా: బిసిసిఐ అవినీతి వ్యతిరేక్ కోడ్ ఆర్టికల్ 2.1.1, ఆర్టికల్ 2.1.2, ఆర్టికల్ 2.1.4లను ఉల్లంఘించినందున ఇతనిపైనా ఐదేళ్లపాటు వేటు వేయడం జరిగింది. ఇతను కూడా బిసిసిఐ, అనుబంధ సంస్థలు నిర్వహించే ఏ క్రికెట్ టోర్నీలోనూ పాల్గొన కూడదు. బిసిసిఐ ఆదేశాలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.
అసద్ రావుఫ్ విచారణ కూడా సోమవారమే ఉండగా.. అతను హాజరుకాలేదు. తనపై జరుగుతున్న విచారణ న్యాయబద్ధంగా జరగడం లేదని, విచారణ అధికారిని మార్చాలని కోరాడు. అయితే ఇందుకు క్రమశిక్షణ కమిటీ అంగీకరించలేదు.
ఫిబ్రవరి9, 2016లోగా తన వాదనను వినిపించుకోవాలని బిసిసిఐ.. రావుఫ్‌కు సూచించింది. ఫిబ్రవరి 12, 2016న తుది ఆదేశం ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేసింది.