కోహ్లీతో సెల్ఫీ నా కల!: 15 ఏళ్లకే కోటీశ్వరుడైన ప్రయాస్ రే బర్మన్

హైదరాబాద్: ఐపీఎల్ 12వ సీజన్ కోసం వేలం ముగిసింది. ప్రాంఛైజీలు యువ ఆటగాళ్లపై కాసుల వర్షం కురిపించాయి. అయితే, ఈ వేలంలో 15 ఏళ్ల ప్రయాస్ రే బర్మన్‌ను బెంగళూరు రూ. 1.50 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అతి పిన్న వయసులో కోటీశ్వరుడైన ఆటగాడిగా ప్రయాస్ రే బర్మన్ నిలిచాడు.
15 ఏళ్ల ప్రయాస్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వీరాభిమాని. అంతేకాదు విరాట్ కోహ్లీతో సెల్ఫీ తీసుకోవాలనేది చిరకాల కోరిక. ఎప్పటికయినా దాన్ని తీర్చుకోవాలని గట్టిగానే ప్రయత్నం చేశాడు. అయితే, ఇప్పుడు కోహ్లీ కెప్టెన్‌గా వహిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టే అతడిని వేలంలో సొంతం చేసుకుంది.

చిన్ననాటి కోరికను తీర్చుకోనున్నా
దీంతో త్వరలోనే తన అభిమాన క్రికెటర్‌ను కలవడంతో పాటు చిన్ననాటి కోరికను తీర్చుకోనున్నానని ప్రయాస్ మురిసిపోతున్నాడు. వేలం అనంతరం పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ప్రయాస్ రే బర్మన్ మాట్లాడుతూ "చాలామంది యువతలాగే నాకు కూడా విరాట్ కోహ్లీ రోల్ మోడల్. ఎప్పటినుంచో ఆయనతో సెల్ఫీ తీసుకోవాలని నా కోరిక" అని అన్నాడు.

సెల్ఫీ కోసం ఎన్నో సార్లు ప్రయత్నించా
"దీని కోసం ఎన్నో సార్లు ప్రయత్నించా. కానీ అన్ని సార్లూ విఫలమయ్యాను. కానీ ఇప్పుడు నేను ఆయనతో ఏకంగా డ్రెస్సింగ్‌రూమ్‌నే పంచుకోబోతున్నా. నా హీరోతో కొన్ని రోజుల పాటు కలిసి ఉండబోయే అవకాశం నాకు కలిగింది. దీన్ని నేను నమ్మలేకపోతున్నా. ఇక నేను నా సోదరిని ఎంతో మిస్ అవుతున్నాను. నేను క్రికెట్ లో ఈ స్థాయికి రావడానికి ఆమే కారణం" అని అన్నాడు.

ఆర్సీబీ దక్కించుకోవడంతో
ప్రయాస్ రే బర్మన్ సోదరి ఐటీ ప్రొఫెషనల్. బెంగళూరులో ఆమె సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈ వేలంలో తనను ఆర్సీబీ దక్కించుకోవడంతో తన సోదరితో కూడా కొంత సమయం గడపొచ్చు అనే ఆలోచనలో ఉన్నాడు. "నా సోదరి ఐటీ ప్రొఫెషనల్ అయినప్పటికీ నేను క్రికెట్‌ను ఎంచుకున్నా. క్రికెట్ నేర్చుకునేందుకు నాకు ఎంతో ఫ్రీడమ్ ఇచ్చారు. నా సోదరి ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడికి వెళ్లేందుకు ఎంతో ఆతృతగా ఉన్నా" అని బర్మన్ చెప్పుకొచ్చాడు.

బౌలింగ్ విషయానికి వస్తే
ఇక, బౌలింగ్ విషయానికి వస్తే అంతర్జాతీయ క్రికెట్‌లో షేన్ వార్న్, అనిల్ కుంబ్లేలు తన రోల్ మోడల్స్ అని చెప్పాడు. బెంగాల్‌కు చెందిన ప్రయాస్ రే బర్మన్ ఆల్ రౌండర్ కావడం విశేషం. లెగ్ స్పిన్‌తో పాటు బ్యాట్ కూడా సత్తా చాటగలడు. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన బర్మన్ విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపడం వేలంలో అతడికి కలిసొచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications