
హైదరాబాద్: ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లోనే మేటి ఆటగాడు సోమవారం ఉప్పల్ స్టేడియంలో కనువిందు చేయనుండటంతో కోహ్లి ఫీవర్ పట్టుకుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 11వ సీజన్‌లో ఇప్పటి వరకు 4 మ్యాచ్‌లు జరగగా.. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. శనివారం వారాంతమైనా.. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్ ప్రారంభమయ్యాక కూడా ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి.
ఐతే కోహ్లి ఫీవర్ నేపథ్యంలో సోమవారం నాటి సన్‌రైజర్స్, బెంగళూరు మ్యాచ్ టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మ్యాచ్‌కు 15 రోజుల ముందు నుంచే ఆన్‌లైన్‌లో, జింఖానా మైదానంలో టిక్కెట్లు సోల్డ్‌ఔట్ బోర్డులు దర్శనమిచ్చాయి. కాస్త ఆలస్యంగా టిక్కెట్ల కోసం రంగంలోకి దిగిన అభిమానులకు ఈ పరిణామం నిరాశ కలిగిస్తోంది. ఇక ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు అలాంటి పరిస్థితే ఎదురైంది.
పాసుల కోసం ఉప్పల్ స్టేడియం చుట్టూ ఎంత తిరిగినా ఫలితం ఉండటం లేదు. 'పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న సన్‌రైజర్స్.. టిక్కెట్ల అమ్మకంపై దృష్టిసారించింది. కాంప్లిమెంటరీ పాసులు చాలా వరకు తగ్గించింది. ఈ సీజన్‌లో బెంగళూరుతో పోరు సన్‌రైజర్స్ ఫ్రాంచైజీకి పెద్ద మ్యాచ్. 10 రోజుల ముందే టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. 38 వేల టిక్కెట్లు హాట్ కేకుల్లా అయిపోడానికి కోహ్లినే కారణం' అని ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణలో ఉన్న హైదరాబాద్ క్రికెట్ సంఘం(హెచ్‌సీఏ) అధికారి ఒకరు వ్యాఖ్యానించాడు.
ఇప్పటివరకూ.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన 9మ్యాచ్‌లలో ఏడింటిని గెలిచి టాప్ 1 స్థానంలో కొనసాగుతుండగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం ఆడిన తొమ్మిదింటిలో కేవలం మూడు మాత్రమే గెలిచి పోరుకు సిద్ధమవుతోంది.