కొచ్చి: ఐపియల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం కేసు నుంచి నిర్దోషిగా బయటపడితే పేసర్ శ్రీశాంత్‌కు అన్ని మద్దతు ఇస్తానని బిసిసిఐ ఉపాధ్యక్షుడు, ఐపియల్ పాలక మండలి సభ్యుడు టిసి మాథ్యూస్ అన్నారు. ఢిల్లీ కోర్టులో విచారణ సాగుతోందని, అతను నిర్దోషిగా తేలుతాడనీ తిరిగి క్రికెట్ ఆడుతాడని తాను ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేసు ఏమవుతందనే విషయం గురించి తాను మాట్లాడబోనని, తాను శ్రీశాంత్‌తో నిన్ననే మాట్లాడానని ఆయన చెప్పారు. కోర్టు శ్రీశాంత్‌ను నిర్దోషిగా ప్రకటిస్తే, అతను తిరిగి క్రికెట్ మైదానంలోకి దిగవచ్చునని, కేరళ క్రికెట్ సంఘం తరఫున తామంతా, బిసిసిఐ ఉపాధ్యక్షుడిగా తాను శ్రీశాంత్‌కు మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.

ప్రపంచంలోనే అథి పెద్ద క్రికెట్ ఈవెంట్ అయిన ఐపియల్ పారదర్శకమైన వ్యవహారంగా ఉండేందుకు ఐపియల్ జట్ల ప్రమోటర్ల ఆర్థిక లావాదేవీలను క్షుణ్నంగా పరిశీలిస్తామని ఆయన చెప్పారు. వాటా బదిలీని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత తాము ఆమోదం తెలిపామని ఆయన అన్నారు. ఐపియల్ గౌరవాన్ని తిరిగి నిలబెడుతామని ఆయన అన్నారు. ఎర్నాకులం ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మంగళవారంనాడు మాట్లాడారు.
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఐపియల్ ప్రతిష్టను దెబ్బ తీయడంపై ప్రతిస్పందిస్తూ - అవినీతి, ఫిక్సింగ్, బెట్టింగ్ వంటివి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. దాని గురించి సందేహం అక్కర్లేదని అన్నారు. ఐపియల్ ప్రతిష్టను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.