హైదరాబాద్: మరి కొన్ని నెలలో భారత్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ - ఐపీఎల్ 2017 సీజన్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కలర్ బ్యాట్‌ను వాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డెక్కన్ క్రానికల్ రిపోర్టు ప్రకారం ఐపీఎల్‌లో రైజింగ్ పూణె సూపర్ గెయింట్స్‌గా కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్ ధోనికి రంగు బ్యాట్‌ను అందజేయడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రముఖ బ్యాట్ల తయారీ కంపెనీ 'స్పార్టన్ స్పోర్ట్స్' ప్రతినిధి కామెరూన్ మర్చంట్ చెప్పాడు.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)లో వెస్టిండీస్ క్రికెటర్లు క్రిస్‌గేల్, ఆండ్రూ రస్సెల్‌లు కలర్ బ్యాట్‌లను ఉపయోగించిన సందర్భాన్ని కూడా కామెరూన్ మర్చంట్ గుర్తు చేశారు. బీబీఎల్‌లో బ్రిజార్డ్, మిచెల్ జాన్సన్‌లు రంగు బ్యాట్‌లను ఉపయోగించిన సంగతి తెలిసిందే.

సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో థండర్స్ ప్లేయర్ రస్సెల్ ప్రత్యేకంగా తయారు చేసిన బ్యాట్‌తో ఏడవ స్ధానంలో బరిలోకి దిగాడు. బ్యాట్ మొత్తం నలుపు రంగు, పైన గులాబీ పట్టీలు ఉన్న ఈ బ్యాట్‌తో ఆడడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
అయితే క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనలకు లోబడి కలర్ బ్యాట్‌తో మ్యాచ్ ఆడేందుకు అనుమతించింది. మ్యాచ్ అనంతరం బ్యాట్‌పై ఫీడ్ బ్యాక్ తీసుకుని రస్సెల్ బ్యాట్‌పై నిషేధం విధించింది. బ్యాట్‌కు ఉన్న నలుపు రంగు బంతికి అంటుకుంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా రంగుల బ్యాట్‌పై తాత్కాలిక నిషేదం విధించింది.