
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అమ్ముడుపోనందుకు నిరాశ చెందానని ఇంగ్లాండ్ టెస్టు కెప్టెన్ జో రూట్ అన్నాడు. ఐపీఎల్ 2018 సీజన్ కోసం ఈ ఏడాది జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ వేలంలో మొత్తం 578 ప్లేయర్స్‌ను వేలం వేయగా చాలా మంది క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తి చూపించలేదు. ముఖ్యంగా విదేశీ క్రికెటర్లలో ఫామ్‌లో ఉన్న యువ క్రికెటర్లనే కొనుగోలు చేసేందుకు ప్రాంఛైజీలు ఆసక్తిని కనబర్చాయి. దీంతో అమ్ముడుపోని ఆటగాళ్లలో జో రూట్ ఉన్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా జోరూట్ మాట్లాడుతూ ఐపీఎల్‌లో ఆడలేకపోతున్నందుకు ఆవేదన వ్యక్తం చేశాడు. 'నేను చాలా నిరాశచెందాను. ఎందుకంటే ఐపీఎల్‌లో ఎక్కువ టీ20 మ్యాచ్‌లు ఆడొచ్చనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లాలని అనుకున్నాను. కేవలం డబ్బులు సంపాదించేలానే ఉద్దేశంతో అక్కడ ఆడాలనుకోలేదు' అని పేర్కొన్నాడు.
'ఐపీఎల్‌లో ఏ ఒక్క జట్టు తరఫున ఆడాటానికి నేను ఫిట్‌గా లేననుకోవట్లేదు. వాస్తవానికి అక్కడ పెద్దగా చేయాల్సిందేమీ లేదు. ఇది చాలా నిరాశకు గురిచేసింది. కానీ అర్ధం చేసుకోగలను. ఆయా ఫ్రాంఛైజీలు వారికి కావాల్సిన విధంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకొని జట్టును సిద్ధం చేస్తుంటాయని' రూట్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ మ్యాచ్‌ల ద్వారా టీ20 క్రికెట్‌ను ఎంతో మెరుగుపరచుకోవచ్చని జో రూట్ అన్నాడు. ఐపీఎల్ లాంటి టోర్నీలో ఆడటం ఒక అద్భుత అవకాశమని వివరించాడు. వరల్డ్ కప్ టీ20 మ్యాచ్‌ల్లో సత్తాచాటేందుకు కావాల్సిన అనుభవం ఐపీఎల్ ద్వారా వస్తుందని పేర్కొన్నాడు.
కాగా, భారత్ వేదికగా 2016లో జరిగిన వరల్డ్ టీ20 టోర్నీ ఇంగ్లాండ్ జట్టు ఫైనల్‌కు చేరడంలో జో రూట్ కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో జో రూట్ 145 స్ట్రయిక్ రేట్‌తో 249 పరుగులు సాధించాడు. అయితే ఈ టోర్నీలో రూట్‌తో పోలిస్తే విరాట్ కోహ్లీ, బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్ ఇంకా ఎక్కువ పరుగులు చేశారు.
వాస్తవానికి ఐపీఎల్ వేలానికి ముందు జో రూట్ మాట్లాడుతూ 'గత రెండు సంవత్సరాల్లో టీ20 క్రికెట్ పెద్దగా ఆడలేదు. రెండేళ్లలో ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ ఆడితే నాకు కొంత సన్నాహకంగా ఉంటుంది. అందుకే ఐపీఎల్ ఆడాలనుకుంటున్నా' అని చెప్పాడు. వేలంలో జో రూట్ కనీస ధరను రూ.1.5 కోట్లుగా నిర్ణయించారు.