క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. నవంబర్ మూడు లేదా ఆఖరి వారంలో మెగా ఆక్షన్ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈసారి కూడా విదేశాల్లో మెగా వేలాన్ని నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. ఐపీఎల్-17వ సీజన్ కోసం గత డిసెంబర్‌లో దుబాయ్ వేదికగా వేలం జరిగిన విషయం తెలిసిందే.
అయితే ఈ సారి అబుదాబి వేదికగా ఐపీఎల్ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక రిటైన్షన్ రూల్స్‌పై ఈ నెలాఖరులోపు స్పష్టత రానుంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటైన్ ప్లేయర్ల జాబితాను ప్రకటించడానికి నవంబర్ 15న ఆఖరి తేదీగా ఖరారు చేసినట్లుగా సమాచారం. రిటైన్డ్ ప్లేయర్ల జాబితాపై పరిమితి, రైట్ టూ మ్యాచ్ కార్డ్ అమలు చేయాలా? వద్దా? అన్‌క్యాప్డ్, రిటైర్మెంట్ ప్లేయర్లకు సంబంధించిన విధివిధానాలు, ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యూను పెంచడం వంటి నిబంధనలపై బీసీసీఐ మరో రెండు వారాల్లో తుది నిర్ణయం తీసుకోనుంది.

ఈ నిబంధనలపై బీసీసీఐ ఓ క్లారిటీకి రావడంతో ఐపీఎల్ మెగా వేలం తేదీ ఖరారు చేశారని సమాచారం. వేలం నిబంధనలతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్, ఓ ఓవర్‌లో రెండు బౌన్సర్లకు అనుమతి రూల్స్ గురించి బీసీసీఐ మరికొన్ని రోజుల్లో స్పష్టత ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ ప్లేయర్ల జాబితాను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. రూల్స్ ప్రకటించకముందే తమ జట్టు నిర్మాణంపై ఓ క్లారిటీ తెచ్చుకోవాలని భావిస్తున్నాయి.
టీమిండియా మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ రాజస్థాన్ రాయల్స్‌కు కోచ్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌తో పాటు పంజాబ్ కింగ్స్ కూడా కొత్త కోచ్‌ను నియమించుకుంది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ రికీ పాంటింగ్‌ను కోచ్‌గా ఎంపిక చేసుకుంది. ఈ దిగ్గజాలు తమ వ్యూహాలతో జట్లను ఏ రీతిలో నిర్మిస్తారనే ఆసక్తి మొదలైంది. మరోవైపు ద్రవిడ్ గత తన టీమిండియా సహాయక సిబ్బందిని రాజస్థాన్ రాయల్స్‌కు కూడా నియమించుకోవాలని చూస్తున్నాడు. బ్యాటింగ్ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, అలాగే బౌలింగ్ కోచ్‌గా పరాజ్ మాంబ్రేను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.