భారత క్రికెట్ దశను మార్చిన ఐపీఎల్: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద లీగ్
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల రూపంలో బీసీసీఐకి కాసుల వర్షం కురిపించింది. సోమవారం జరిగిన ఐపీఎల్ మీడియా హక్కుల వేలంలో 2018 నుంచి 2022 వరకూ ఐదేళ్ల కాలానికి టెలివిజన్, డిజిటల్ హక్కుల్ని స్టార్ ఇండియా రూ.16,347.5 కోట్లకు సొంతం చేసుకుంది.
స్టార్ ఇండియా ఇంత భారీ మొత్తంలో వెచ్చించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పది సంవత్సరాల కిందట ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు ప్రసార హక్కుల్ని ఓ సంస్థ రూ.5800 కోట్లు కొనుగోలు చేస్తే అద్భుతమని అనుకున్నాం. ఆ తర్వాతి
ఏడాది ఈ ఒప్పందాన్ని రద్దు చేసి సోనీ సంస్థకు రూ.8200 కోట్లకు హక్కులు కట్టబెట్టినప్పుడూ నోరెళ్లబెట్టాం.
అయితే ఇప్పుడు ఐదేళ్ల కాలానికే ఐపీఎల్ మీడియా హక్కుల ధర రెట్టింపు కావడంతో ఐపీఎల్ సత్తా ఏంటో యావత్ ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద మీడియా హక్కుల ఒప్పందంగా ఇది నిలిచింది. ఈ ఒప్పందం ప్రకారం స్టార్ ఇండియా ఒక్కో ఐపీఎల్ మ్యాచ్‌కు బీసీసీఐ రూ. 55 కోట్లు చెల్లించనుంది.
ఉదాహరణకు ఒక ఐపీఎల్ సీజన్‌లో ఉండే మ్యాచ్‌లు మొత్తం 60. ఐదు సీజన్లకు కలిసి మొత్తం 300 మ్యాచ్‌లు అవుతాయి. అంటే ఒక్కో మ్యాచ్‌కు సగటు ఖర్చు రూ.54.5 కోట్లు అన్నమాట. తాజా వేలం ప్రకారం ఐపీఎల్‌కు స్టార్ ఇండియా ఏడాదికి రూ.3,270 కోట్లు చెల్లిస్తుంది.
ఇది ప్రస్తుతం టీమిండియా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు చెల్లిస్తున్న దాని కన్నా రూ.12 కోట్లు అధికం కావడం విశేషం. 2012-18 వరకు స్టార్ ఇండియా కోహ్లీసేన మ్యాచ్‌ల టెలివిజన్, డిజిటల్ ప్రసార హక్కులు చెల్లిస్తున్నది రూ.3,851 కోట్లే. అంటే భారత్‌లో టీమిండియా ఆడే అంతర్జాతీయ మ్యాచ్ ద్వారా బోర్డుకు లభించే ఆదాయం 43 కోట్లన్నమాట.

మొత్తం ఏడు కేటగిరీలుగా మీడియా హక్కులు
తాజా వేలంలో మొత్తం ఏడు కేటగిరీలుగా మీడియా హక్కులకు బీసీసీఐ టెండర్లు ఆహ్వానించింది. ప్రపంచ వ్యాప్తంగా అంటే భారత్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, యూరప్, అమెరికాల్లో ఐపీఎల్ ప్రసార, డిజిటల్ హక్కులు స్టార్ ఇండియా పరమయ్యాయి. ఈసారి భారత్‌లో ప్రసార హక్కులకే సోనీ దాఖలు చేసిన బిడ్ విలువ రూ.11,050 కోట్లు. అయితే ఇదే విభాగానికి స్టార్ ఇండియా కోట్ చేసిన ధర రూ. 6,196 కోట్లు ఎంతో తక్కువే. కానీ.. డిజిటల్ హక్కులు కూడా కలిపి స్టార్ సమర్పించిన బిడ్ విలువ రూ. 16,347 కోట్లు సోనీ కంటే ఎక్కువ.

ఎక్కువ మొత్తంలో బిడ్ దాఖలు చేసిన స్టార్
దీంతో ప్రసార, డిజిటల్ ప్రపంచవ్యాప్త హక్కులకు కలిపి ఎక్కువ మొత్తంలో బిడ్ దాఖలు చేసిన స్టార్‌కు టెండర్ దక్కింది. తాజా వేలంతో ప్రపంచ అగ్రశ్రేణి మూడు జట్ల ప్రసార హక్కులు ప్రస్తుతం స్టార్ సంస్థ వద్దే ఉన్నాయి. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్‌లన్నింటికీ కలిపి ఏడాదికి స్టార్ చెల్లించేది 512 మిలియన్ డాలర్లు. ఇక ఐపీఎల్‌కు చెల్లిస్తున్నది 508 మిలియన్ డాలర్లు. దీనిని బట్టి చూస్తే ఐపీఎల్ సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్, వెస్టిండీస్ కరీబియన్ లీగ్, ఇంగ్లాండ్‌లోని ఏ లీగ్ కూడా ఐపీఎల్ దరిదాపులకు కూడా రావు.

అత్యధిక విలువైన క్రీడా లీగ్‌ల్లో మూడో స్థానం
బిగ్‌బాష్ హక్కుల్ని స్టార్ 20 మిలియన్ డాలర్లకే కైవసం చేసుకోవడం విశేషం. ఈ వేలం దెబ్బతో ఐపీఎల్‌కు ప్రపంచంలో అత్యధిక విలువైన క్రీడా లీగ్‌ల్లో మూడో స్థానం దక్కింది. ప్రపంచంలో అమెరికాలో జరిగే నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (రూ.144 కోట్లు), ఐరోపాలో జరిగే ఫుట్‌బాల్ ప్రిమియర్ లీగ్ (రూ.84 కోట్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో టీవీ, భారత్‌లో డిజిటల్ హక్కులకు వేర్వేరుగా అమెరికా, ఐరోపా, మధ్య ప్రాచ్య దేశాలు, ఆఫ్రికా, ఇతర ప్రపంచ దేశాల టీవీ, డిజిటల్ హక్కులకు కలిపి.. మొత్తం ఏడు బిడ్‌లు నిర్వహించగా అన్నింటికీ కలిపి ఉమ్మడిగా అత్యధిక ధర కోట్ చేసిన స్టార్ ఇండియానే హక్కులను సొంతం చేసుకుంది.

రూ.16,347.50 కోట్లు మాల్దీవుల జీడీపీకి సమానం
దీంతో 2018 నుంచి 2022 వరకు ప్రసారమయ్యే ఐపీఎల్ టోర్నీని స్టార్ స్పోర్ట్స్‌లో చూడబోతున్నాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ భారత క్రికెట్ తీరునే మార్చింది. ఒకప్పుడు భారత క్రికెట్ మ్యాచుల్ని ప్రసారం చేసేందుకు బీసీసీఐ దూరదర్శన్‌కు 1990ల్లో రూ.5 లక్షలు చెల్లించేది. ఇప్పుడు అదే బీసీసీఐ ఐపీఎల్ హక్కుల ద్వారా ఏడాది రూ.3,270 కోట్లు ఆర్జిస్తోంది. ఈ వేలం ద్వారా బీసీసీఐకి వచ్చిన రూ.16,347.50 కోట్లు మాల్దీవుల జీడీపీకి సమానం. ఇక, మన పొరుగు దేశమైన భూటాన్ జీడీపీకి ఎన్నో రెట్లు ఎక్కువ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications