
అయిదేళ్ల మీడియా హక్కుల కోసం..
వచ్చే అయిదు సంవత్సరాలకు ఉద్దేశించిన మీడియా రైట్స్ ఇవి. 2023 నుంచి 2027 వరకు ప్రసార హక్కులను కేటాయించడానికి ముంబై వేదికగా దీన్ని నిర్వహిస్తోంది బీసీసీఐ. ఈ ఉదయం 11 గంటల నుంచి బిడ్డింగ్స్ దాఖలవుతున్నాయి. మీడియా ప్రసార హక్కుల ఇ-వేలంపాటలను మొత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించింది బీసీసీఐ. ఏ, బీ, సీ, డీగా వర్గీకరించింది.

నాలుగు ప్యాకేజీల్లో..
ప్యాకేజీ-ఏలో.. ఐపీఎల్ మ్యాచ్‌లను భారత ఉపఖండంలో మాత్రమే ప్రసారం చేయడం, ప్యాకేజీ-బీలో.. డిజిటల్ హక్కులను మాత్రమే పొందడం, భారత ఉపఖండంలో మాత్రమే మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయడం. ప్యాకేజీ-సీలో.. ప్లేఆఫ్స్ కూడా కలుపుకొని కొన్ని ప్రత్యేకమైన మ్యాచ్‌లను మాత్రమే ప్రసారం చేయడానికి అవసరమైన డిజిటల్ హక్కులు ఉంటాయి. ఈ మ్యాచ్‌లను భారత ఉపఖండంలో టెలికాస్ట్ చేయాల్సి ఉంటుంది. ప్యాకేజీ-డీలో.. భారత ఉపఖండం మినహాయించి ప్రపంచం మొత్తం టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మీద ఐపీఎల్ మ్యాచ్‌లను టెలికాస్ట్ చేయడం.

తొలి రెండు ప్యాకేజీల్లో..
ప్యాకేజీ-ఏ, ప్యాకేజీ-బీలో సాయంత్రం 4:30 గంటల వరకు 42,000 కోట్ల రూపాయల మేర బిడ్డింగ్స్ దాఖలయ్యాయి. నాలుగు ప్యాకేజీలకు కలిపి బీసీసీఐ నిర్ధారించిన బేస్ ప్రైస్ మొత్తం 32,890 కోట్ల రూపాయలు. కాగా తొలిరెండు ప్యాకేజీల్లోనే ఈ బేస్‌ప్రైస్ మొత్తం కంటే 10,000 కోట్ల రూపాయలు అధికంగా బిడ్డింగ్స్ దాఖలయ్యాయి. దీన్ని బట్టి చూస్తోంటే.. ఈ మొత్తం 60,000 కోట్ల రూపాయలను దాటొచ్చనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.

ఒక్క మ్యాచ్ ప్రసారం ఖరీదు.. రూ.100 కోట్లు..
ప్రస్తుతం ఈ మీడియా ప్రసార హక్కులు స్టార్ చేతిలో ఉన్నాయి. 2017లో 16,347 కోట్ల రూపాయలతో దీన్ని దక్కించుకుందా నెట్‌వర్క్. ఇప్పుడు పోటీ తీవ్రమైంది. బేస్ ప్రైస్ కూడా రెట్టింపయింది. రేసులో హేమాహేమీల్లాంటి కార్పొరేట్ కంపెనీలు నిల్చున్నాయి. ఈ పోటీ, తొలి రెండు ప్యాకేజీల్లోనే 42,000 కోట్లు దాఖలు కావడం వల్ల ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ప్రసార ఖరీదు 100 కోట్ల రూపాయల వరకు చేరింది. ఐపీఎల్ మ్యాచ్ లైవ్ బ్రాడ్ కాస్ట్‌కు ప్రత్యేకంగా నిర్ధారించిన బేస్ ప్రైస్ 19,000 కోట్ల రూపాయలు కాగా.. ఇప్పుడది 24,000 కోట్ల రూపాయలకు చేరింది. ఇంకా బిడ్డింగ్స్ దాఖలవుతున్నాయి.

రేసులో కార్పొరేట్ దిగ్గజాలు..
ఈ హక్కులను పొందడానికి కొన్ని కార్పొరేట్ దిగ్గజాలు రేసులో నిల్చున్నాయి. డిస్నీస్టార్, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ నెట్‌వర్క్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి బిగ్ షాట్స్ బిడ్డింగ్స్‌ను దాఖలు చేశాయి. వాటితో పాటు టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో కూడా పోటీలో ఉన్నాయి. డిజిటల్ హక్కుల కోసం మాత్రమే టైమ్స్ ఇంటర్నెట్, రిలయన్స్ జియో బిడ్డింగ్స్ వేయనున్నాయి. సూపర్ స్పోర్ట్ ఇంటర్నేషనల్ టెర్రిటరీ హక్కుల కోసం బిడ్డింగ్స్ వేసింది.

పోటీ ఆ మూడు కంపెనీల మధ్యే..
ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. పోటీ ప్రధానంగా మూడు కంపెనీల మధ్యే నడుస్తోంది. డిస్నీస్టార్, రిలయన్స్ వయాకామ్ 18, సోనీ నెట్‌వర్క్ మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది. ప్యాకేజీ-ఏ కోసం బిడ్డింగ్స్ దాఖలు చేసిన జీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ఆ అవకాశం దక్కకపోవచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












