
4 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత
మంగళవారం చెన్నై, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా చెపాక్ స్టేడియం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మ్యాచ్ నిర్వహిస్తే స్టేడియంలోకి పాముల్ని వదులుతామని ప్రో-తమిళ్ పార్టీ తమిళగ వాళ్వురిమై కచ్చి (టీవీకే) హెచ్చరించింది. దీంతో 4 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

మ్యాచ్ ప్రారంభానికి ముందు గందరగోళం
మంగళవారం కోల్‌కతా-చెన్నై జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు గందగోళ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. మ్యాచ్‌ను కావేరీ బోర్డుతో లింకుపెట్టి మ్యాచ్‌ను జరగనివ్వమని ఇప్పటికే స్పష్టం చేసిన కొన్ని రాజకీయ పార్టీల నేతలు, సంఘాల నాయకులు మైదానంలోకి వెళ్తున్న క్రికెట్ అభిమానులపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు.

400 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
దీంతో 400 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మ్యాచ్ నిర్వహణకు వ్యతిరేకంగా కొంతమంది నిరసనకారులు నలుపు రంగు బెలూన్లను కూడా గాల్లోకి విడుదల చేశారు. చెపాక్ స్టేడియం పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా ఆందోళన వ్యక్తం చేశారు.

కావేరీ జలవివాదం పరిష్కారం అయ్యే వరకు
కావేరీ జలవివాదం పరిష్కారం అయ్యే వరకు చెన్నైలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిషేధించాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో చెన్నైలో చెన్నై మ్యాచ్‌లు సజావుగా జరిగేలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాను మంగళవారం ఆయన కలిశారు.

పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో తొలి మ్యాచ్
సంబంధిత అధికారులతో మాట్లాడామని, పూర్తి భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వడంతో మ్యాచ్ నిర్వహించనున్నట్లు శుక్లా చెప్పారు. ఇక, మంగళవారం మ్యాచ్ జరుగుతున్న సమయంలో నిరసనకారులు మరింతగా రెచ్చిపోయారు. నిరసనకారులు షూ విసిరి మ్యాచ్‌కు ఆటంకం కల్పించే ప్రయత్నం చేశారు.

రవీంద్ర జడేజాపైకి షూ విసిరి నిరసన
చెన్నై జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఆటగాళ్లపై వారు బూట్లు విసిరి తమదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు. లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రవీంద్ర జడేజా లక్ష్యంగా బూట్లు విసరగా, అవి గురి తప్పి బౌండరీ లైన్ వద్ద పడ్డాయి. ఆ సమయంలో అక్కడ దక్షిణాఫ్రికా ఆటగాళ్లు డుప్లెసిస్, ఎంగిడి ఉన్నారు.

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై విజయం
దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. రవీంద్ర జడేజాపై బూట్లు విసిరిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మిగతా మ్యాచ్‌లను చెన్నైలో నిర్వహించకపోవడమే మంచిదన్న అభిప్రాయంతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఉన్నట్లు సమాచారం. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది.

విశాఖకు అవకాశం దక్కేనా!
చెన్నై సూపర్ కింగ్స్ తమ హోం గ్రౌండ్‌ను ఏ నగరానికి మారుస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ధోని రైజింగ్ పుణె సూపర్ జెయింట్‌కు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పూణెలో తీవ్ర నీటికొరత ఉండటంతో పుణె జట్టు తమ గ్రౌండ్‌గా విశాఖపట్నంను ఎంచుకుంది. ధోనికి విశాఖ మైదానం ఎంతో ప్రత్యేకం. ఇక్కడ అతడికి అద్భుతమైన రికార్డులున్నాయి. పిచ్‌పై పూర్తి అవగాహన ఉంది. దాంతో పాటు అభిమానుల మద్దతు సైతం ఎక్కువగానే ఉంటుంది. మరి విశాఖ నగరానికి ఈ అవకాశం దక్కుతుందేమో చూడాలి.


Click it and Unblock the Notifications












