
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం వాంఖడె స్టేడియంలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం ధోని మాట్లాడుతూ వాంఖడె పిచ్ స్పిన్నర్లకు సహకరించేలా కనిపించడం లేదని చెప్పాడు. మరోవైపు రోహిత్ శర్మ సైతం టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకుంటానని చెప్పాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమెరగని సీఎస్‌కేని సొంతగడ్డపై ఓడించాలని ముంబై ఇండియన్స్ గట్టి పట్టుదలతో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ముంబై ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకే మ్యాచ్‌లో గెలిచి, రెండింట పరాజయం పాలైంది.
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు మంచి రికార్డు ఉన్నా... ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం పేలవ ప్రదర్శన చేసింది. ఇరు జట్ల మధ్య జరిగిన గణాంకాలను చూస్తే ఈ విషయం తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై, చెన్నై జట్ల మధ్య ఇప్పటివరకు 24 మ్యాచ్‌లు ఆడగా... అందులో 13సార్లు ముంబై, 11 సార్లు చెన్నై విజయం సాధించింది.
జట్ల వివరాలు:
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ, క్వింటన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జాసన్ బెహ్రాన్‌డార్ఫ్, రాహుల్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ
చెన్నై సూపర్ కింగ్స్:
అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, కేదార్ జాదవ్, ధోని, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, మెహిత్ శర్మ, ఇమ్రాన్ తాహిర్