హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఆర్థిక నేరారోపణలతో దేశం విడిచి పారిపోయిన లలిత్ మోడీ తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ ధోనికి ఇండియా సిమెంట్స్ ఇచ్చిన ఉద్యోగ ఆఫర్ లెటర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో లీక్ చేశాడు.

ఏడాదికి వంద కోట్లు ధోనీకి ముట్టజెప్పడమే ఉద్యోగం ఇవ్వడానికి కారణమని లలిత్ మోడీ ఆరోపించారు. లలిత్ మోడీ లీక్ చేసిన ధోని ఆఫర్ లెటర్ ఇండియా సిమెంట్స్ 2012లో ఇచ్చినది కావడం విశేషం. ఈ ఆఫర్ లెటర్ ప్రకారం ప్రకారం చూస్తే ధోనీకి నెలకు బేసిక్ పే రూ. 43000, డీఏ రూ. 21,970, స్పెషల్ పే రూ. 20,000, ప్రత్యేక సదుపాయాల కోసం రూ. 60,000 సహా ఓవరాల్‌గా రూ.100 కోట్లు కంపెనీ అందిచనుంది.
ఏడాదికి వంద కోట్లు సంపాదించే మహేంద్ర సింగ్ ధోనికి ఉద్యోగం ఎందుకని ప్రశ్నించాడు. దీని వెనుక ఉన్న అసలు మర్మం ఏమిటని నిలదీశాడు. ఇదిలా ఉంటే ఇండియా సిమెంట్స్‌కు బీసీసీఐ మాజీ చీఫ్ శ్రీనివాసన్ యజమాని. ఇండియా సిమెంట్స్‌కి చెందిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోని కెప్టెన్‌గా ఉండటం, ఆ తర్వాత స్ఫాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో ఆ జట్టుపై రెండేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.