ఐపీఎల్-2024 సీజన్ అద్భుతాలకు వేదికగా మారింది. గత సీజన్లలో సాధ్యం కానీ అరుదైన రికార్డులన్నీ ఈసారి నమోదవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు అత్యధిక స్కోరు, అంతేగాక ఛేదనలో ఓ టీమ్ సాధించిన అత్యధిక పరుగులు ఈ ఏడాదే నమోదవ్వడం విశేషం. తాజాగా ఈ ఐపీఎల్ 17వ సీజన్‌లో మరో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
అయితే ఇది గొప్పగా చెప్పుకునే ఘనత కాదు, ఎవరూ కోరుకోనిది. అసలేం రికార్డు నమోదైదంటే.. ఓ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లకు జరిమానా విధించారు. ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు సారథులకు ఫైన్ వేయడం ఇదే ప్రథమం. లక్నో వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌లో ఇది జరిగింది. స్లో ఓవర్ రేట్ కారణంగా సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, లక్నో సారథి కేఎల్ రాహుల్‌కు రూ.12 లక్షల చొప్పున జరిమానా వేశారు.

''లక్నో సూపర్ జెయింట్స్ - చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు కారణంగా లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్‌కు చెరో రూ. 12 లక్షల జరిమానా విధించారు'' అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, సొంతమైదానంలో శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్.
ఆఖర్లో ఎంఎస్ ధోనీ (28; 9 బంతుల్లో, 3x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అజింక్య రహానె (36; 24 బంతుల్లో, 5x4, 1x6), మొయిన్ అలీ (30; 20 బంతుల్లో, 3x6) ఫర్వాలేదనిపించారు. లక్నో బౌలరల్లో కృనాల్ పాండ్య (2/16) రెండు వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది.
కేఎల్ రాహుల్ (82; 53 బంతుల్లో, 9x4, 3x6) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. క్వింటన్ డికాక్ (54; 43 బంతుల్లో, 5x4, 1x6) ఆకట్టుకున్నాడు. రాహుల్-డికాక్ తొలి వికెట్‌కు 139 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. నికోలస్ పూరన్ (23*; 12 బంతుల్లో, 3x4, 1x6) మెరిశాడు.