

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ చేసింది. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో గురువారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 188 పరుగుల లక్ష్య చేధనలో బెంగళూరు బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ (70 నాటౌట్: 41 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సులు) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టుని గెలిపించలేకపోయాడు.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
నిర్ణీత ఓవర్లలో బెంగళూరు 5 వికెట్లు కోల్పోయి 181 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు విజయానికి ఆఖరి 18 బంతుల్లో 40 పరుగులు అవసరమయ్యాయి. ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో వరుసగా 4, 6, 6 బాదిన ఏబీ డివిలియర్స్ 18 పరుగులు రాబట్టాడు.
దీంతో సమీకరణం 12 బంతుల్లో 22 పరుగులుగా మారింది. ఇన్నింగ్స్ 19వ ఓవర్ వేసిన జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్‌తో డివిలియర్స్‌ని కట్టడి చేస్తూ కేవలం 5 పరుగులు మాత్రమే ఇవ్వడంతో పాటు దూకుడుగా ఆడుతోన్న గ్రాండ్‌హోమ్ (2)ని ఔట్ చేశాడు. దీంతో సమీకరణం 5 బంతుల్లో 17 పరుగులుగా మారింది.
ఇక, ఆఖరి ఓవర్ వేసిన మలింగ తొలి బంతికే సిక్స్ కొట్టించుకున్నా తర్వాత తన యార్కర్లలో వరుసగా 1, 1, 1, 1,0 తో ముంబైని గెలిపించాడు. నిజానికి ఆఖరి బంతిని మలింగ నోబాల్‌గా విసిరినా ఫీల్డ్ అంపైర్ పసిగట్టలేకపోయాడు. దీంతో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
అంతకముందు రోహిత్ శర్మ (48), సూర్యకుమార్ యాదవ్ (38), హార్దిక్ పాండ్యా (32 నాటౌట్), యువరాజ్ సింగ్ (23) చెలరేగడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ-క్వింటన్ డీకాక్‌లు అదిరిపోయే శుభారంభాన్నిచ్చారు.
వీరిద్దరూ తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించిన తర్వాత డీకాక్ ఔటయ్యాడు. ఆ తర్వాత మరో రోహిత్ శర్మ 8 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 48 పరుగులు స్కోరు వద్ద ఔటవ్వడంతో తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (38), యువరాజ్ సింగ్‌తో కలిసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించాడు.
ముఖ్యంగా చాహల్ బౌలింగ్‌లో యువీ కొట్టిన హ్యాట్రిక్ సిక్స్‌లు ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఆ తర్వాత వీరిద్దరూ 18 పరుగుల వ్యవధిలోనే ఔట్ కావడంతో ముంబై ఇండియన్స్ స్కోరు నెమ్మదించింది. ఈ ఇద్దరినీ చాహాల్ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత చాహల్ వేసిన మరుసటి ఓవర్‌లో పొలార్డ్(5) ఔటయ్యాడు.
చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ 4 వికెట్లు తీయగా.... ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు.