

హైదరాబాద్: ఐపీఎల్ 2019 సీజన్‌లో ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తొలి బోణీ కొట్టింది. చెపాక్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ నిర్దేశించిన 71 పరుగుల విజయ లక్ష్యాన్ని సీఎస్‌కే 17. 4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి చేధించింది.
మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. చెన్నై స్పిన్నర్లు హర్భజన్ సింగ్ (3/20), ఇమ్రాన్ తాహిర్ (3/9) ధాటికి 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటవగా.. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టులో అంబటి రాయుడు (28: 42 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో చెన్నై జట్టు మరో 14 బంతులు మిగిలి లక్ష్యాన్ని ఛేదించేసింది.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 70 పరుగులకే చాపచుట్టేసింది. ఓపెనర్ పార్థివ్ పటేల్(29) మినహా ఎవరూ రెండంకెల స్కోరును చేయడంలో విఫలం కావడంతో ఆర్సీబీ మూడంకెల మార్కును చేరలేకపోయింది. ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ(6), మొయిన్ అలీ(9), ఏబీ డివిలియర్స్(9) హెట్‌మెయిర్(0), శివం దుబే(2), గ్రాండ్ హోమ్(4)లు తీవ్రంగా నిరాశపరిచారు.
చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో హర్బజన్ సింగ్ విజృంభించాడు. మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు తీసి ఆర్సీబీని ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో హర్భజన్ మూడు వికెట్లు తీయగా... అతనికి జతగా ఇమ్రాన్ తాహీర్ మూడు వికెట్లు సాధించగా, రవీంద్ర జడేజా రెండు వికెట్లు తీశాడు. డ్వేన్ బ్రేవోకు వికెట్ దక్కింది.