
హైదరాబాద్: ఆసియా కప్‌లో మెరుగైన ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించాడు భారత యువ పేసర్ ఖలీల్ అహ్మద్. భారత్-విండీస్ మధ్య జరిగిన రెండో టీ20లో ఖలీల్ రెండు కీలక వికెట్లు తీశాడు. విండీస్ ఓపెనర్లు హెట్‌మెయిర్, షైహోప్‌ను పెవిలియన్ పంపించాడు. ఆ మ్యాచ్‌లో సరిగా క్రీజులో కుదురుకోక ముందే ఓపెనర్లను ఔట్ చేశాడు. అయితే తనకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం ఎంతగానో టీమిండియాలో ఉపయోగపడుతోందని ఖలీల్ అంటున్నాడు.
మరో రెండు రోజుల్లో విండీస్‌తో మూడో టీ20 జరగనున్న నేపథ్యంలో ఖలీల్ మాట్లాడాడు. 'టీమిండియాలో ఆడుతున్న ఆటగాడిగా నామీద ఇప్పుడు ఎంతో బాధ్యత ఉంది.దీన్ని నేను బరువుగా అనుకోవడంలేదు. నాబాధ్యతను నేను ఎంజాయ్‌ను చేస్తున్నాను. టీమిండియాలో ఆడాలనేది నా చిన్ననాటి కల. ఇప్పుడది తీరింది.ఒత్తిడికి లోనయితే నా బాధ్యతను నేను పూర్తి స్థాయిలో నిర్వర్తించలేను.'
'జట్టులో నేను ఉన్నప్పుడు నా బాధ్యతను నిర్వర్తించడంపైనే దృష్టి సారిస్తాను. ఆటను ఎంజాయ్ చేసినప్పుడే దాన్ని ఇంకాబాగా ఆడాలనే ఆశ కలుగుతుంది. అప్పుడు మెరుగైన ప్రదర్శన చేయగలం. ఇప్పటికయితే ఐపీఎల్‌లో నేను ఆడిన అనుభవం నాకు మేలు చేస్తోంది. టీమిండియాలో డైరెక్ట్‌గా చోటు సంపాదించడం కంటే ఐపీఎల్‌లో ఆడితే ఆటకు సంబంధించి భయం పోతుందనేది నా అభిప్రాయం' అని చెప్పుకొచ్చాడు.
భారత్-విండీస్‌ల మధ్య మూడో టీ20 ఈనెల 11న జరగనుంది.ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్ నెగ్గిన భారత్ క్లీన్‌స్వీప్‌పై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో అయినా నెగ్గి పరువు కాపాడుకోవాలని విండీస్ భావిస్తోంది.