టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యపై భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించాడు. దేశవాళీ క్రికెట్, టెస్టులు ఆడకుండా టీ20లపై మాత్రమే హార్దిక్ పాండ్య దృష్టిపెట్టడంపై అసహనం వ్యక్తం చేశాడు. ఇతర ఆటగాళ్లలపై నిబంధనలు విధించినట్లుగా హార్దిక్ పాండ్యపై బీసీసీఐ ఎందుకు రూల్స్ అమలు చేయట్లేదని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించాడు.
సెంట్రల్ కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశవాళీ క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపట్లేదనే కారణంతో ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌పై బీసీసీఐ కొరడా ఝుళిపించింది. సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి వారిద్దరి పేర్లను తొలగించింది. మరోవైపు గాయాలతో టీమిండియాకు దూరమైన రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యకు కాంట్రాక్ట్‌ను పునరుద్ధరించింది.

ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ హార్దిక్ పాండ్య గురించి మాట్లాడాడు. ఇతర ఆటగాళ్లతో హార్దిక్ పాండ్యను బీసీసీఐ సమానంగా చూడకుండా ప్రత్యేకంగా ఎందుకు చూస్తుందని ప్రశ్నించాడు. ''హార్దిక్ పాండ్య ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డాడా? అతడు కూడా ఆడాల్సిందే. హార్దిక్‌కు ఎందుకు ఢిప్రెంట్ రూల్స్? బీసీసీఐ అయినా సరే అతడిని మందలించాలి కదా?''
''మూడు ఫార్మాట్లు ఆడాలి. లేదా 60 నుంచి 70 టెస్టులు ఆడాలి. కానీ కేవలం టీ20లు మాత్రమే ఆడతానంటే ఎలా? దేశానికి నువ్వు కావాలి. టెస్టు క్రికెట్ ఆడటానికి ఇష్టం లేకపోతే లిఖితపూర్వకంగా స్టేట్‌మెంట్ ఇవ్వు. తనని టెస్టులకు ఎంపిక చేయొద్దని బీసీసీఐకి హార్దిక్ ముందే చెప్పేశాడనుకుంటా'' అని ప్రవీణ్ కుమార్ అన్నాడు.
వన్డే వరల్డ్ కప్‌లో గాయపడిన హార్దిక్ పాండ్య ఆ తర్వాత టీమిండియాకు దూరమయ్యాడు. ఇటీవల డీవై పటేల్ టీ20 టోర్నీతో తిరిగి పోటీ క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం ఐపీఎల్ కోసం సన్నద్ధమవుతున్నాడు. మరో వారం రోజుల్లో ప్రారంభంకానున్న 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ హార్దిక్ నడిపించనున్న విషయం తెలిసిందే.
ట్రేడింగ్‌లో గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ తిగిరి ముంబై గూటికి చేరిన విషయం తెలిసిందే. అంతేగాక హార్దిక్‌కు కెప్టెన్సీ ముంబై ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు అందించింది. అయిదు టైటిళ్లు సాధించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్‌ను సారథిగా ఎంపిక చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మొదలుకానుంది. ప్రారంభమ్యాచ్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది.