హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చేయనున్న ప్రతిపాదనలు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఆడేలా చేయనున్నాయా? అంటే అవుననే అంటున్నారు క్రీడా విశ్లేషకులు.
మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా గత రెండేళ్లుగా నిషేధం ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలు మళ్లీ 2018 ఐపీఎల్‌లో పునరాగమనం చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నై, రాజస్ధాన్ ప్రాంఛైజీలు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వద్ద కొత్తగా ఒక అభ్యర్థనని ఉంచాయి.

ఆ అభ్యర్ధన ఏంటంటే
రైజింగ్ పుణె సూపర్ జెయింట్, గుజరాత్ లయన్స్ జట్లలోని కీలక ఆటగాళ్లను వేలంతో సంబంధం లేకుండా తిరిగి పాత జట్లే తీసుకునేలా ఐపీఎల్ పాలకమండలి నిబంధనలు రూపొందించనుందట. నవంబర్ నెలలో జరగనున్న వర్క్‌షాప్‌లో ఈ నిబంధనకు మిగతా ఫ్రాంచైజీలు ఒప్పుకుంటే ధోని చెన్నై జట్టు తరుపున ఆడేందుకు మార్గం సుగమనం అయినట్లే.
'ముగ్గురు ఆటగాళ్లను ఫ్రాంచైజీలు తిరిగి తీసుకునేలా ప్రతిపాదిస్తున్నాం. అందులో ఒక స్వదేశీ, ఇద్దరు విదేశీ ఆటగాళ్లు ఉంటారు. రెండేళ్లుగా పుణె, గుజరాత్‌కు ఆడుతున్న ఆటగాళ్లను చెన్నై, రాజస్థాన్ తిరిగి తీసుకోవచ్చు. వచ్చే నెల వర్క్‌షాప్‌లో దీన్ని యజమానుల ముందు ఉంచుతాం' అని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడొకరు తెలిపారు.
ఇదే గనుక జరిగితే మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా, సురేశ్ రైనాలు చెన్నై సూపర్ కింగ్స్ ప్రాంఛైజీ సొంతం చేసుకుంటుంది. దీనిపై ఐపీఎల్ ఛైర్మన్ రాజీశ్ శుక్లా మాట్లాడుతూ 'రైట్ టూ మ్యాచ్ సహా ముగ్గురు లేదా ఐదుగురు ఆటగాళ్లను తిరిగి తీసుకునేలా ప్రతిపాదిస్తాం. ఫ్రాంచైజీల అంగీకారాన్ని బట్టి ముందుకెళ్తాం' అని అన్నారు.
ప్రాంఛైజీలు అంగీకరించకపోతే!
(ఐపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చేసిన ప్రతిపాదనలను ఒకవేళ ఏవైనా ఫ్రాంఛైజీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. చెన్నై సూపర్ కింగ్స్‌కి ధోని దొరకడం కష్టమవుతుంది.