
హైదరాబాద్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భాగంగా ఇంగ్లండ్‌లో యమరంజుగా మ్యాచులు కొనసాగుతున్నాయి. హోరాహోరీగా తలపడుతున్నాయి. భారీ స్కోర్లను సాధిస్తూ దూసుకెళ్తున్నాయి. బ్యాటింగ్, బౌలింగ్‌కు మధ్య పోటీ పతాకస్థాయికి చేరుకుంటోంది. వ్యూహాలు-ప్రతి వ్యూహాలు, దాడులు-ఎదురుదాడులు, ఎత్తులు పైఎత్తులతో మ్యాచ్‌లు సాగుతున్నాయి. క్రికెట్ల జట్ల పరిస్థితి అక్కడ అలా ఉంటే- మనదేశంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు మాటల యుద్ధాన్ని ఆరంభించాయి. ట్విట్టర్ వేదికగా ఓ చిన్నపాటి యుద్ధం చేస్తున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ ఫ్రాంఛైజీల యాజమాన్యం మధ్య ట్వీట్ల యుద్ధం రాజుకుంది.
ఎక్కడ మొదలైందంటే..
మాంఛెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు బౌలింగ్‌ను తుత్తునీయలు చేస్తూ, చిత్తు చిత్తుగా ఓడించింది ఇంగ్లండ్. ఆఫ్ఘనిస్తాన్‌పై 397 పరుగుల భారీ స్కోరును సాధించింది. ఈ రెండు జట్లలోని కీలక ఆటగాళ్లు ఇద్దరు ఐపీఎల్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ తరఫున ఆడుతున్నారు. ఇంగ్లండ్ క్లాసికల్ ఓపెనర్ జానీ బెయిర్‌స్టో, ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ తురుపు ముక్క రషీద్ ఖాన్ ఇద్దరూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు సభ్యులు. తొమ్మిది ఓవర్లలో ఏకంగా 110 పరుగులను సమర్పించుకున్న రషీద్ ఖాన్ సంగతి పక్కన పెడితే.. 90 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్న బెయిర్‌స్టోను అభినందిస్తూ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ ట్వీట్ పోస్ట్ చేసింది తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో. 99 బంతుల్లో ఎనిమిది ఫోర్లు మూడు సిక్సర్లతో 90 పరుగులు చేసిన బెయిర్‌స్టోకు అభినందనలు అనేది ఆ ట్వీట్ సారాంశం.
కౌంటర్ ఇచ్చిన చెన్నై సూపర్‌కింగ్స్
ఈ ట్వీట్ చూసిన వెంటనే చెన్నై సూపర్ కింగ్స్ ఓ కౌంటర్ ట్వీట్ చేసింది. బెయిర్‌స్టో గురించి కాదు గానీ.. రషీద్ ఖాన్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదంటూ ట్వీట్ చేసింది. 54 బంతుల్లో 110 పరుగులను సమర్పించుకోవడం బాధాకరం.. అంటూ ఎద్దేవా చేసింది. దీనిపై కౌంటర్ ఎటాక్ ఇచ్చింది సన్ రైజర్స్. చెన్నై సూపర్‌కింగ్స్ తరహాలనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ కూడా తమిళనాడుకు చెందినదే కావడం వల్ల తమిళంలోనే కౌంటర్ ఇచ్చింది ఎస్ఆర్‌హెచ్.