
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎడిషన్ సెకెండ్ ఫేస్ వచ్చేనెల ఆరంభం కానుంది. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ మ్యాచ్‌లు సాగనున్నాయి. అబుధాబి, దుబాయ్, షార్జా స్టేడియాల్లో ఐపీఎల్ 2021లో మిగిలిపోయిన మ్యాచ్‌లను నిర్వహించబోతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. దీనికి సంబంధించిన కంప్లీట్ షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేసింది. వచ్చేనెల 19వ తేదీన తొలి మ్యాచ్ ఏర్పాటు కానుంది. సెకెండ్ ఫేస్ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
కాగా- టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటివ్ విభాగంలో భారత సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన నీరజ్ చోప్రాకు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ వినూత్నంగా గౌరవించింది. అతనికి కోటి రూపాయల నజరానాను ప్రకటించింది. అదే సమయంలో నీరజ్ చోప్రా గౌరవార్థం కొత్తగా ఓ జెర్సీని కూడా రూపొందించాలని నిర్ణయించింది. ఈ జెర్సీ నంబర్ 8758. భారత్‌కు బంగారు పతకాన్ని అందించడానికి నీరజ్ చోప్రా సంధించిన జావెలిన్ థ్రో అందుకున్న మీటర్ల దూరం అది. 87:58 మీటర్ల దూరం నీరజ్ చోప్రా తన జావెలిన్‌ను సంధించాడు. దానికి గుర్తుగా 8758 నంబర్ జెర్సీని రూపొందించనుంది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్.
మ్యాచ్‌లు జరిగిన ప్రతి స్టేడియానికి ఈ జెర్సీని తీసుకెళ్లి.. ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్‌లో ఉంచాలని చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్‌మెంట్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ జెర్సీని చూసి.. క్రికెటర్లు స్ఫూర్తిని పొందుతారని అభిప్రాయపడుతోంది. ఒలింపిక్స్‌లో ఓ అథ్లెట్ తొలిసారిగా స్వర్ణం సాధించడం అద్భుత ఘట్టమని, దాన్ని తమ వెంటే ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ జెర్సీని రూపొందించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వాన్ని వహిస్తోన్న మహేంద్ర సింగ్ ధోనీకి ఆర్మీ అధికారులు లెప్టినెంట్ కల్నల్ హోదాను ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసింది. నీరజ్ చోప్రా కూడా ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ స్థాయి అధికారి అని పేర్కొంది.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ ఏడు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను, రెజ్లింగ్‌లో రవికుమార్ దహియా రజతాన్ని గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు, రెజ్లింగ్‌లో బజరంగ్ పునియా, బాక్సింగ్‌లో లవ్లీనా బొర్గోహెయిన్‌తో పాటు పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని అందుకుంది. అన్నింటికీ మించి- నీరజ్ చోప్రా పసిడి పతకంతో భారత ప్రస్థానాన్ని దిగ్విజయంగా ముగించాడు. జావెలిన్ థ్రోలో భారత్‌కు తొలిసారిగా బంగారు పతకాన్ని అందించాడు. దీనితో దేశం మొత్తం అతన్ని ప్రశంసల్లో ముంచెత్తుతోంది.