IPL 2022 Final: ఐపీఎల్ ఫైనల్లో గెలిచేదెవరో చెప్పేసిన భజ్జీ, రైనాతో సహా మరో ముగ్గురు క్రికెట్ దిగ్గజాలు..

రెండు నెలలుగా టీ20 బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌లతో ఐపీఎల 2022 సీజన్ కనువిందు చేసింది. మార్చి 26న 10జట్లు ఐపీఎల్ ట్రోఫీ కోసం తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఇక ఐపీఎల్ తుది అంకానికి చేరుకుంది. అన్ని జట్లు వైదొలిగిపోగా చివరకు రెండు జట్లు మిగిలాయి. ట్రోఫీ కోసం నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ పోరాటానికి రెడీ అయ్యాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్‌కు ముందు ఆ జట్ల గత గెలుపోటములు, పిచ్ రిపోర్టులు, ప్రస్తుత స్థితి తదితర విషయాల ఆధారంగా ఏ జట్టు గెలుస్తుందో పలువురు దిగ్గజ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఇకపోతే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫైనల్‌కు ఎలాంటి ఒడిదొడుకులు ఎదుర్కోకుండా చేరుకుంది. కాగా రాజస్థాన్ మాత్రం ప్లేఆఫ్ క్వాలిఫయర్ 1లో గుజరాత్ తో ఓడి తర్వాత క్వాలిఫయర్ 2లో ఆర్సీబీతో గెలిచి ఫైనల్ చేరుకుంది. ఇకపోతే తమ హోంగ్రౌండ్లో గుజరాత్ టైటాన్స్ ఫైనల్ ఆడనుండడం ఆ జట్టుకు చాలా ప్లస్ కానుంది.

హర్భజన్, షోయాబ్ అక్తర్, రైనాలకు నిశ్చితాభిప్రాయం
మరోవైపు రాజస్థాన్ 14సీజన్ల తర్వాత ఈసారే ఫైనల్‌కు చేరుకుంది. 2008 ప్రారంభ సీజన్లో రాజస్థాన్ ఫైనల్‌కు చేరుకుని విజయాన్ని సాధించింది. ఇక ఇటీవల ఆ జట్టు ఫస్ట్ రాయల్ షేన్ వార్న్ మరణించడంతో రాయల్స్ అతని స్మారకంగా ఈ ట్రోఫీ గెలవాలని గట్టి నిశ్చయంతో ఉంది. అయితే రాజస్థాన్ వర్సెస్ గుజరాత్ మధ్య పోరులో గెలిచేదెవరనే విషయంలో చాలా మంది ప్రముఖ క్రికెటర్లు గుజరాత్ టైటాన్స్ వైపు మొగ్గుచూపారు. టీమిండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్, పాకిస్థాన్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా సైతం హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్సే ట్రోఫీ గెలుస్తుందని పేర్కొన్నారు.

గుజరాత్ వైపు స్వల్ప మొగ్గు ఉంది
ఇక రైనా మాట్లాడుతూ.. 'గుజరాత్ టైటాన్స్ ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్ కంటే స్వల్ప ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుందని నేను భావిస్తున్నా. వారికి నాలుగైదు రోజుల మంచి విశ్రాంతి, ప్రాక్టీసు లభించింది. అలాగే వారు ఈ సీజన్‌లో మంచి టెంపోతో ఆడుతున్నారు. అయినప్పటికీ రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ క్రీజులో ఉన్నప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఆర్‌ఆర్‌ని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు. ఎందుకంటే ఆ జట్టు పడి లేచిన కెరటంలా మళ్లీ పుంజుకుంది. ఈ సీజన్‌లో ఇప్పటికే జోరుమీదున్న జోస్ బట్లర్ ఫైనల్లో చెలరేగితే ఆ జట్టుకు భారీ బోనస్ అవుతుంది. కాబట్టి.. టైటాన్స్ చాలా జాగ్రత్తగా డిఫెండ్ చేయాల్సి ఉంటుంది. అహ్మదాబాద్‌లో వికెట్ అద్భుతంగా ఉంది కాబట్టి బ్యాటర్ల నుంచి మంచి స్ట్రోక్స్ రావడానికి వీలుంది' అని రైనా పేర్కొన్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌కు ఓ అవగాహన ఉంది
2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో భాగమైన దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ మాట్లాడుతూ.. గుజరాత్ టైటాన్స్ కంటే రాజస్థాన్ రాయల్సే గెలిచే వీలుంది. వారు అల్రెడీ నరేంద్ర మోదీ స్టేడియంలో ఓ మ్యాచ్ ఆడారు. ఇక్కడ ఎలా ఆడాలో వారికొక అవగాహన వచ్చి ఉంటుంది. వారు ఇక్కడి వాతావరణం, ఔట్‌ఫీల్డ్, పిచ్, అదనపు బౌన్స్‌కు అలవాటు పడ్డారు. కాబట్టి రాయల్సే ఫేవరేట్ అని గ్రేమ్ స్మిత్ పేర్కొన్నారు.

అది గుజరాత్ టైటాన్స్‌కు అరిష్టం
ఆసీస్ లెజెండరీ క్రికెటర్ మరియు మాజీ చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ మాథ్యూ హేడెన్ సైతం ఫైనల్లో ఎవరు గెలుస్తారనేదానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇక ఫైనల్లో టైటాన్స్‌కు ఎక్కువగా అరిష్టాలు జరిగే అవకాశం ఉంది. రాజస్థాన్ వైపు మ్యాచ్ మలుపు తిప్పేలా కన్పిస్తోంది. అహ్మదాబాద్లోని గ్రౌండీ బౌన్సీ వికెట్‌తో ఆస్ట్రేలియా వికెట్‌ను పోలి ఉంటుంది. కాబట్టి గుజరాత్ టైటాన్స్‌కు అలాంటి బంతులను సమర్థంగా ఆడే ప్లేయర్లు అయితే కన్పించడం లేదు. ఇది నిజంగా ఆ జట్టుకు ఓ అరిష్ట సంకేతమని చెప్పాలి. ఏదేమైనా రాజస్థాన్ కాస్త దుర్భేద్యంగా కన్పిస్తోందంటూ' హేడెన్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications