
హైదరాబాద్: నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుని ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
చెన్నై జట్టులో షేన్ వాట్సన్ 59 బంతుల్లో 80(8 ఫోర్లు, 4సిక్సులు) చివరివరకు పోరాడినప్పటికీ జట్టుని ఓటమి నుంచి తప్పించలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో రైనా(8), అంబటి రాయుడు(1), కెప్టెన్ ధోని(2) రనౌట్ కావడంతో విజయావకాశాలను దెబ్బతీసింది. ముంబై బౌలర్లలో బుమ్రా రెండు, కృనాల్ పాండ్యా, లసిత్ మలింగ, రాహుల్ చాహర్ తలో వికెట్ తీసుకున్నారు.
చెన్నై విజయ లక్ష్యం 150
అంతకమందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు 150 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఓపెనర్ క్వింటన్ డికాక్(29) కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(15) కూడా చాహర్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్ నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్‌లో జట్టు స్కోరు 82 పరుగుల వద్ద సూర్యకుమార్(15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కృనాల్ పాండ్యా(7) పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో నేరుగా అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
దీంతో 89 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ముంబై ఇండియన్స్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత తాహీర్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(23) రైనాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో కీరన్ పొలార్డ్ జట్టుకు అండగా నిలిచాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్థిక్ పాండ్యా(16) దీపక్ చాహర్ వేసిన 19వ ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.
ఆ తర్వాత అదే ఓవర్‌లో రాహుల్ చాహర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. అయితే, చివర్లో పొలార్డ్ 25 బంతుల్లో 41( 3 ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడటంతో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్ మూడు, శార్దూల్, తాహీర్‌లు తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై
అంతకముందు టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే చెరో మూడుసార్లు ట్రోఫీని ముద్దాడిన ఈ రెండు జట్లు... ఈ మ్యాచ్‌లో నెగ్గే జట్టు నాలుగో సారి టైటిల్ నెగ్గి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో చెన్నైపై లీగ్ దశలో రెండుసార్లు, క్వాలిఫయర్‌లో ఓసారి మొత్తం మూడు విజయాలను ముంబై ఇండియన్స్ నమోదు చేసింది. దీంతో పాటు 2018 నుంచి రెండు జట్ల మధ్య ఐదు మ్యాచ్‌లు జరగ్గా నాలుగింటిలో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.
గతంలో చెన్నైతో జరిగిన మూడు ఫైనల్స్‌లోనూ రెండుసార్లు నెగ్గిన జోష్‌తో ముంబై ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ కావడంతో మ్యాచ్‌ని ప్రత్యేక్షంగా వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియానికి తరలి వచ్చారు. హైదరాబాద్‌లో ఫైనల్ జరగడం ఇది రెండోసారి. వాస్తవానికి ఈ మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో జరగాల్సి ఉన్నా స్టాండ్స్ వివాదం కారణంగా హైదరాబాద్ ఆతిథ్యమిచ్చింది.