
ఐపీఎల్ 2022 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) యువ ప్లేయర్ రజత్ పటీదార్ (54 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లతో 112 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి టాక్ ఆఫ్ ది క్రికెట్ న్యూస్‌గా మారాడు. అతని విధ్వంసం వల్ల లక్నో సూపర్ జెయింట్స్ ముందు ఆర్‌సీబీ 208పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసి 14పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇకపోతే ఆర్సీబీ క్వాలిఫయర్ 2లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది.
ఈ మ్యాచ్‌లో రజత్ పటీదార్ బ్యాటింగ్ విన్యాసాలను ఎంత పొగిడినా తక్కువే. ఫాఫ్ డుప్లెసిస్ (0), కోహ్లీ (25), మహిపాల్ లోమ్రోర్ (14), మ్యాక్స్ వెల్ (9) విఫలమైనా.. దినేష్ కార్తీక్ (37)తో కలిసి పటీదార్ ఇన్నింగ్స్‌ను ఓ రేంజులో నడిపించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా ప్లే ఆఫ్స్‌లో (49బంతుల్లో) అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్‌గా వృద్దిమాన్ సాహా రికార్డును పటీదార్ సమం చేశాడు. ఐపీఎల్‌లో సెంచరీ సాధించిన నాలుగో అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా, ప్లేఆఫ్స్‌లో సెంచరీ సాధించిన తొలి అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా నిలిచాడు.
ఇకపోతే ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో టాప్ 5లో కూడా రజత్ పటీదార్ ప్లేస్ సంపాదించాడు. ఇకపోతే ఈ లిస్టులో తొలి స్థానంలో ఉన్న ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్. 2014సీజన్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడిన సెహ్వాగ్ క్వాలిఫయర్ 2లో సీఎస్కే మీద 122పరుగులు చేశాడు. 2వ స్థానంలో సీఎస్కే ఓపెనర్ షేన్ వాట్సన్ (117పరుగులు నాటౌట్) 2018సీజన్ ఫైనల్లో సన్ రైజర్స్ మీద చేశాడు. 3వ స్థానంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ సాహా (115పరుగులు నాటౌట్) 2014సీజన్ ఫైనల్లో కేకేఆర్ మీద చేశాడు.
4వ స్థానంలో సీఎస్కే ప్లేయర్ మురళీ విజయ్ (113పరుగులు ) 2012 సీజన్ క్వాలిఫయర్ 2లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మీద చేశాడు. 5వ స్థానంలో ఆర్సీబీ ప్లేయర్ రజత్ పటీదార్ (112పరుగులు నాటౌట్) 2022 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మీద (112పరుగులు నాటౌట్) చేశాడు.