ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్‌పాట్ కొట్టారు. రిషభ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు ఖర్చు పెట్టింది. శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లు వెచ్చించింది. వెంకటేశ్ అయ్యర్‌కు పంట పండింది. తమ గూటికి తిరిగి తెచ్చుకోవాలని కేకేఆర్ రూ.23.75 కోట్లు కుమ్మరించింది.
ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి రోజు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎస్‌ఆర్‌హెచ్ సీఈవో కావ్య మారన్ చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎనిమిది మంది ఆటగాళ్లను దక్కించుకుంది. భారత బౌలర్లపై ఫోకస్ చేసింది. అర్షదీప్ సింగ్ కోసం తీవ్రంగా ప్రయత్నించింది. కానీ ఆర్‌టీఎమ్‌తో పంజాబ్ కింగ్స్ అర్షదీప్ సింగ్‌ను తిరిగి దక్కించుకుంది. అయితే మహ్మద్ షమి (రూ. 10 కోట్లు), హర్షల్ పటేల్ (రూ. 8 కోట్లు)లను కాస్త చౌకబేరానికే సొంతం చేసుకుని బౌలింగ్ లైనప్‌ను పటిష్టంగా మార్చుకుంది.

పవర్ హిట్టర్ ఇషాన్ కిషన్ (రూ. 11.25 కోట్లు)ను దక్కించుకుని, తమ బ్యాటింగ్ ఆర్డర్‌ను మరింత బలోపేతంగా మార్చింది. అభినవ్ మనోహర్ (రూ. 3.20 కోట్లు)తో యువ ఫినిషర్‌ను దక్కించుకుంది. ప్రధాన స్పిన్నర్ పాత్ర కోసం రాహుల్ చాహర్ (రూ. 3.20 కోట్లు), ఆడమ్ జంపా (రూ. 2.40 కోట్లు)లను దక్కించుకుంది. దేశీయ యువ ఆటగాళ్లను సిమర్‌జీత్ సింగ్ (రూ. 1.50 కోట్లు), అథర్వ (రూ.30 లక్షలు) సొంతం చేసుకుంది. భారీ మొత్తాన్ని వెచ్చించకుండా కాస్త తక్కువ ధరకే నాణ్యమైన ఆటగాళ్లను సొంతం చేసుకుంది. రూ.45 కోట్లతో వేలంలోకి వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.5.15 కోట్లు మిగుల్చుకుంది.
అయితే రిటైన్ ఆటగాళ్లు క్లాసెన్ (23), కమిన్స్ (18), అభిషేక్ (14), హెడ్ (14), నితీశ్‌కుమార్ (6)లలో కలుపుకుని ప్రస్తుతం సన్‌రైజర్స్ వద్ద 13 మంది ప్లేయర్లు ఉన్నారు. అందులో 9 మంది భారత ఆటగాళ్లు, నలుగురు విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే ఎస్‌ఆర్‌హెచ్‌కు మరో 12 మంది అవసరం. అందులో గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను దక్కించుకోవాల్సి ఉంది.
మిగిలిన రూ.5.15 కోట్లతో కావ్య మేడమ్ ఎంత మంది నాణ్యమైన ఆటగాళ్లను దక్కించుకుంటుందనే ఆసక్తికరంగా మారింది. మరో స్టార్ ఫారెన్ ప్లేయర్ జట్టుకు అత్యవసరం. అంతేగాక మిడిలార్డర్‌ను బలోపేతంగా చేసుకునేలా బ్యాటర్లను తీసుకోవాల్సి ఉంది. చాహర్, జంపా ఇద్దరూ లెగ్ స్పిన్నర్లే. దీంతో ఆఫ్‌స్పిన్నర్‌ను తప్పక దక్కించుకోవాల్సి ఉంది.