న్యూఢిల్లీ: కేసీ కరియప్ప... ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ ఎడిషన్‌లో కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్రాంఛైజీ ఇతడిని రూ. 2.40 కోట్లు పెట్టి వేలంలో కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇంతకీ ఎవరీ కరియప్ప అని చాలా మంది క్రికెట్ అభిమానులు గుండెల్లో తొలుస్తున్న ప్రశ్న.
కేసీ కరియప్ప ఓ మిస్టరీ స్పిన్నర్. అంతర్జాతీయ ఆటగాడు కుమార సంగక్కరను మూడు సార్లు వేలంలో పెట్టినా ఆదరణకు నోచుకోని నేపథ్యంలో, కరియప్ప కోనుగోలు నిస్సందేహాంగా ఓ సంచలనం. కర్ణాటకకు చెందిన కేసీ కరియప్ప ఇటీవల నిర్వహించిన కర్ణాటక ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చాడు.

ఇప్పటిదాకా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కూడా అడుగుపెట్టని ఆటగాడు ఐపీఎల్ వేలంలో రూ. 10 లక్షల ప్రారంభ ధరతో మొదలై రూ. 2.40 కోట్లు పలకడంతో దేశ వ్యాప్తంగా క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. తనకు ఇంత భారీ ధర పలకడంపై కేసీ కరియప్ప హర్షం వ్యక్తం చేశాడు. కోల్‌కత్తా నైట్ రైడర్స్ వీడియో విశ్లేషకుడు శ్రీకాంత్ తనను శిక్షణ శిబిరానికి తీసుకెళ్లాడని, నెట్స్‌లో గంభీర్‌కు బౌలింగ్ చేశానని చెప్పాడు.
కోల్‌కత్తా నైట్ రైడర్స్‌కు బౌలింగ్ సలహాదారు వసీం అక్రం తన బౌలింగ్‌ను ప్రశంసించాడని తెలిపాడు. ఆ విధంగా తాను ఐపీఎల్ వేలంలో చోటు దక్కించుకున్నట్లు వివరించాడు. తనకు దక్కే డబ్బుతో తల్లిదండ్రులకు ఒక మంచి ఇల్లు కొనివ్వాలని భావిస్తున్నట్లు తెలిపాడు.
జాక్‌పాట్ కొట్టిన శ్రేయస్ అయ్యర్:
ఐపీఎల్ 8వ ఎడిషన్‌కు సంబంధించి నిర్వహించిన ఆటగాళ్లా వేలంలో ముంబైకి చెందిన శ్రేయస్ అయ్యర్ రూ. 2.6 కోట్లు ధర పలికాడు. ముంబైకి చెందిన శ్రేయస్ అయ్యర్ అండర్ - 19 వరల్డ్ కప్‌తో వెలుగులోకి వచ్చాడు. ఇప్పటి శ్రేయస్ అయ్యర్ ఆడింది 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లే అయినా... సత్తా చాటాడు. లెగ్ బ్రేక్ కూడా వేసే శ్రేయస్ అయ్యర్‌ని ముంబైతో పోటీ పడి మరీ ఢిల్లీ డేర్ డెవిల్స్ ప్రాంచైజీ సొంతం చేసుకుంది.
రూ. 2 కోట్లు పలికిన కెవిన్ పీటర్సన్:
ఇంగ్లాండ్‌కు చెందిన ఈ ఆటగాడి కోసం ఢిల్లీ డేర్ డెవిల్స్ గత ఏడాది నిర్వహించిన వేలం పాటలో రూ. 9 కోట్లు పెట్టింది. కానీ అతను సరిగా ఆడకపోవడంతో ఒప్పందం రద్దు చేసుకుంది. ఈ ఏడాది సన్ రైజర్స్ హైదరాబాద్ కనీస ధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. ఆశ్చర్యం ఏమిటంటే లంక సీనియర్ ఆటగాళ్లు కుమార సంగక్కర, మహిలా జయవర్దనేలను వేలంలో ఏ జట్టు కోనుగోలు చేయలేదు.
భారత ఆటగాళ్లు మునాఫ్ పటేల్, బాలాజీ, ఆర్పీ సింగ్, పూజారా, వేణుగోపాలరావు కూడా అమ్ముడవలేదు. ఇక విదేశీయుల్లో దిల్షాన్, రాస్ టేలర్, కామెరూన్ వైట్, ఆమ్లా, శామ్యూల్స్, డేవిడ్ హస్సి, బొలింజర్, పార్నెల్, అజంత మెండిస్, సేననాయకె, కెవాన్ కూపర్, బ్రాడ్ హాడ్జ్‌లను కూడా ఎవరూ కొనుగోలు చేయక పోవడం విశేషం.