హైదరాబాద్: బెంగళూరులో సోమవారం ఐపీఎల్ 10వ ఎడిషన్ ఆటగాళ్ల కోసం నిర్వహించిన వేలం ప్రక్రియలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంఛైజీ సహయాజమాని ప్రీతిజింటా పాల్గొనలేదు. ప్రతి ఏడాది నిర్వహించే వేలంలో ఉత్సాహంగా పాల్గొనే ప్రీతిజింటా ఈసారి కనిపించకపోవడంతో ట్విటర్ వేదికగా అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా వేలంలో పాల్గొంటారని ఊహించామని కానీ మీరు మాత్రం గైర్హాజరయ్యారని రాజ్ బనర్వాల్ అనే నెటిజన్ ట్వీట్ చేశారు.

ఈ సందర్భంగా అతడి ట్వీట్‌కు స్పందించిన ప్రీతిజింటా 'ఈ ఏడాది నేను కొంచెం బిజీగా ఉన్నాను. కావున హాజరుకాలేకపోతున్నాను. వేలాన్ని పర్యవేక్షించేందుకు, క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకునేందుకు వీరేంద్ర సెహ్వాగ్ అక్కడే ఉన్నాడని' అని ఆమె ట్వీట్టర్‌లో సమాధానమిచ్చింది. వేలంలో పంజాబ్ సొంతం చేసుకున్న ఆటగాళ్లకు ట్విట్టర్‌లో స్వాగతం పలికింది.
కాగా, ఐపీఎల్ 10వ ఎడిషన్ వేలంలో పంజాబ్ జట్టు తరుపున హాజరైన సెహ్వాగ్ కూడా ట్విటర్‌లో స్పందించారు. 'ఈ రోజు ఐపీఎల్ వేలంలో యాజమానులు తమ పని చేసుకున్నారు. సెహ్వాగ్ షాపింగ్ చేశాడు. షాపింగ్‌ను బాగా ఎంజాయ్ చేశాను. ఇదొక మంచి వర్క్‌షాప్ అని' సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
గత రెండు సీజన్లుగా పంజాబ్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన చేసింది. ఈ క్రమంలో జట్టు భవితవ్యాన్ని మార్చేందుకు గాను టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను జట్టు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతో పాటు జట్టు క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా పంజాబ్ యాజమాన్యం నియమించిన సంగతి తెలిసిందే.