ఐపీఎల్ మెగా వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం కురుస్తోంది. అంచనాలకు తగ్గట్లుగా కొందరు రికార్డు ధర అందుకోగా, మరికొందరు తక్కువ ధరకే అమ్ముడుపోయారు. మరికొంతమంది అనూహ్యంగా జాక్‌పాట్ కొట్టారు. రిషభ్ పంత్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లు ఖర్చు పెట్టింది. ఐపీఎల్ వేలం చరిత్రలో అత్యధిక పలికిన ప్లేయర్‌గా పంత్ నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.26.75 కోట్లు వెచ్చించింది.
అయితే రికార్డు ధరలకు ప్రధాన కారణం ఆర్‌టీమ్. అంతేకాదు, ఎన్నో ఫ్రాంచైజీల పర్స్‌ను ఖాళీ చేయించింది కూడా. గతంతో ఉన్న ఆర్‌టీఎమ్ నిబంధనలతో ఫ్రాంచైజీలకు పర్స్‌కు అంత దెబ్బపడేది కాదు. కానీ కొత్త నిబంధనలతో గరిష్ఠ బిడ్‌ను వేయాల్సి వస్తుంది. ఫలితంగా ఫ్రాంచైజీ మిగులు బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

అర్షదీప్ సింగ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.15.75 కోట్లు వెచ్చించడానికి సిద్ధమై తొలుత దక్కించుకుంది. కానీ పంజాబ్ కింగ్స్ ఆర్‌టీఎమ్ అస్త్రాన్ని ఉపయోగించింది. దీంతో ఎస్‌ఆర్‌హెచ్ రూ.18 కోట్లు గరిష్ఠ బిడ్‌గా తెలిపింది. ఆ మొత్తాన్ని చెల్లించి పంజాబ్ దక్కించుకుంది. ఇక పంత్ ఆల్‌టైమ్ రికార్డు ధర పలకడానికి కారణం ఆర్‌టీఎమ్. పంత్ కోసం ఇతర ఫ్రాంచైజీలతో పోటీపడి లక్నో సూపర్ జెయింట్స్ రూ.20.75 కోట్లు వెచ్చిస్తూ పైచేయి సాధించింది.
కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్‌టీఎమ్ కార్డు ఉపయోగిస్తామని చెప్పడంతో.. లక్నో పంత్ కోసం రూ.27 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. దీంతో ఢిల్లీ వెనకడుగు వేసింది. లక్నో దక్కించుకున్నప్పటికీ అదనంగా రూ.6.25 కోట్లు వెచ్చించింది. అలాగే జితేశ్ శర్మను రూ.7 కోట్లకు దక్కించుకోవాల్సిన ఆర్సీబీ.. పంజాబ్ ఆర్‌టీఎమ్ కార్డు వినియోగిస్తానని ముందుకు రావడంతో బెంగళూరు ఫ్రాంచైజీ రూ.11 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. రసిక్ దర్ విషయంలోనూ ఆర్సీబీ ఆర్‌టీఎమ్ వల్ల ఎక్కువ మొత్తం కోల్పోయింది. రూ.2 కోట్లుకు బదులుగా రూ.6 కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చింది.
వేలంలో నమన్ ధిర్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.3.40 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ ముంబై ఇండియన్స్ ఆర్‌టీఎమ్‌తో ముందుకు రావడంతో రాజస్థాన్.. నమన్ కోసం బిడ్‌ను రూ.5.25 కోట్లకు పెంచింది. ఆ మొత్తాన్ని ముంబై చెల్లించి నమన్ ధిర్‌ను తీసుకుంది.
ఆర్‌టీఎమ్‌తో సొంతం చేసుకున్న ఆటగాళ్లు
అర్షదీప్ సింగ్ (రూ.18 కోట్లు)- పంజాబ్ కింగ్స్
జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ (రూ. 9 కోట్లు) - ఢిల్లీ క్యాపిటల్స్
నమన్ ధిర్ (రూ.5.25 కోట్లు)- ముంబై ఇండియన్స్
రచిన్ రవీంద్ర (రూ.4 కోట్లు)- చెన్నై సూపర్ కింగ్స్