ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా జరిగిన ఆక్షన్‌లో మొత్తంగా 182 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంఛైజీలు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ ఎనిమిది ఓవర్సీస్ ప్లేయర్లతో సహా 21 మందిని సొంతం చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కంటే తక్కువ మందిని సొంతం చేసుకున్న ఫ్రాంచైజీగా వేలంలో నిలిచింది.
టైటిల్‌ను గెలిపించిన జట్టులోని ఆటగాళ్లను ఎక్కువ మొత్తంలో తమ ఫ్రాంచైజీలో కొనసాగించాలనే ఉద్దేశంతో రిటెన్షన్, వేలంలోనూ కేకేఆర్ తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో తమ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ కోసం ఏకంగా రూ.23.75 కోట్లు వెచ్చించింది. ఆర్సీబీతో హోరాహోరీగా పోటీపడి దక్కించుకుంది. వేలంలో వాళ్లు సొంతం చేసుకున్న ఆటగాళ్లలో బౌలర్ నోకియా రెండో అత్యధిక ధర రూ.6.50 కోట్లు పొందాడు. ఇది వెంకటేశ్‌కు వెచ్చించిన మొత్తంలో దాదాపు కేవలం నాలుగో వంతు మాత్రమే.

అయితే జట్టును సిద్ధం చేయడంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్న కేకేఆర్‌కు వచ్చే సీజన్‌లో కెప్టెన్ ఎవరనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. భారీ ధర దక్కించుకున్న వెంకటేశ్ అయ్యర్‌కు సారథి బాధ్యతలు అప్పగిస్తారని భావించారంతా. కానీ వెంకటేశ్‌కు కాకుండా జట్టు పగ్గాలను అనుభవజ్ఞుడైన అజింక్య రహానెకు అందివ్వాలని కోల్‌కతా ఫ్రాంచైజీ నిర్ణయించిందని సంబంధింత వర్గాలు తెలిపాయి. కేకేఆర్ నయా కెప్టెన్‌గా రహానె 90 శాతం ఖరారయ్యాడని పేర్కొన్నాయి.
వేలం ఆఖర్లో రహానెను రూ.1.50 కోట్ల కనీస ధరతో కేకేఆర్ సొంతం చేసుకుంది. అయితే ఐపీఎల్‌లో రహానెకు సారథిగా మెరుగైన రికార్డు లేదు. 2018, 2019 సీజన్లలో రాజస్థాన్ రాయల్స్‌ను నడిపించిన రహానె 24 మ్యాచ్‌ల్లో తొమ్మిది విజయాలే అందుకున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టు కెప్టెన్సీని కూడా ఇటీవల కోల్పోయాడు. అతని స్థానంలో శ్రేయస్ అయ్యర్ ముంబైని నడిపిస్తున్నాడు. కాగా, గత సీజన్‌లో జట్టును శ్రేయస్ అయ్యర్ నడిపించిన విషయం తెలిసిందే. అయితే అతన్ని పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
కోల్‌కతా నైట్ రైడర్స్
వెంకటేశ్ అయ్యర్ (23.75), రింకు (13), వరుణ్ (12), నరైన్ (12), రసెల్ (12), నోకియా (6.50), హర్షిత్, రమణ్‌దీప్ (4), డికాక్ (3.60), రఘువంశీ (3), స్పెన్సర్ (2.80), గుర్బాజ్, మొయిన్ అలీ (2), వైభవ్ (1.80), రహానె, పావెల్ (1.50), ఉమ్రాన్ మలిక్, మనీశ్ పాండే (0.75), అనుకుల్ (0.40), లవ్‌నిత్, మార్కండె (0.30).