Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ రెండో రోజు మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
ఈ మెగా ఆక్షన్‌లో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. న్యూజిలాండ్ మాజీ కేప్టెన్, అన్ని ఫార్మట్లల్లో ఫిట్ అనిపించుకోగల కెపాసిటీ ఉన్న కేన్ విలియమ్సన్ అమ్ముడు పోలేదు. రెండో రోజు తొలి రౌండ్‌లో అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ కూడా ముందుకు రాలేదు. సుదీర్ఘకాలం అతన్ని అట్టి పెట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ సహా ఏ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఆసక్తి చూపలేదు.

ఐపీఎల్‌లో సుదీర్ఘకాలంగా ఆడుతున్న అనుభవం ఉంది కేన్ విలియమ్సన్‌కు. 2015లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. 2024 వరకూ కొనసాగాడు. మొత్తంగా 79 మ్యాచ్‌లల్లో 2,128 పరుగులు చేశాడు. ఇందులో 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని వ్యక్తిగత అత్యధిక స్కోరు 64. 125.62 స్ట్రైక్‌రేట్‌ను నమోదు చేశాడు. బ్యాటింగ్ సగటు 35.47.
ఇంత మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నప్పటికీ కేన్ విలియమ్సన్‌పై బెట్ వేయడానికి ఏ ఫ్రాంఛైసీ ముందుకు రాలేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేన్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచ్‌లల్లో సత్తా చాటుతున్న పలువురు ప్లేయర్లు అన్ సోల్డ్‌గా మిగిలిపోయారు తొలి రౌండ్‌లో. అజింక్య రహానె, గ్లెన్ ఫిలిప్స్, కేశవ్ మహరాజ్, శార్దుల్ ఠాకూర్, మయాంక్ అగర్వాల్‌ను ఎవరూ తీసుకోలేదు.
ఇప్పుడు తాజాగా ఇదే జాబితాలో చేరారు వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మలిక్. అతని బేస్‌ప్రైస్ 75 లక్షల రూపాయలు. ఈ మొత్తంతో తీసుకోవడానికి ఏ జట్టు కూడా ఆసక్తి చూపలేదు. 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఐపీఎల్‌లో ఎంట్రీ ఇచ్చిన ఉమ్రాన్ ఈ సీజన్ వరకూ అందులోనే కొనసాగాడు. ఇప్పటివరకు 26 మ్యాచ్‌లను ఆడాడు 29 వికెట్లు పడగొట్టాడు.
2022లో 22 వికెట్లతో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. భారత క్రికెట్‌లో షోయబ్ అఖ్తర్‌గా గుర్తింపు పొందాడు. 2023 నుంచి అతని ఆట గాడి తప్పింది. ఆ సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లల్లో అయిదు వికెట్లే తీసుకున్నాడు.2024లో ఆడింది ఒకే మ్యాచ్. 157 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులను సంధించే సామర్థ్యం ఉన్న బౌలర్‌గా ఉమ్రాన్ రికార్డు నెలకొల్పాడు.
అతనితో పాటు సర్ఫరాజ్ ఖాన్ కూడా అన్ సోల్డ్‌గా మిగిలిపోయాడు. రంజీల్లో టన్నుల కొద్దీ పరుగులు పారించిన రికార్డ్ ఉంది సర్ఫరాజ్ ఖాన్‌కు. కొద్దిరోజుల కిందటే న్యూజిలాండ్‌పై బెంగళూరులో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్‌లో 150 పరుగులు బాదాడు. అతని బ్యాటింగ్ స్టైల్ టీ20 ఫార్మట్‌కు సెట్ కాదనే అభిప్రాయాలు ఉన్నాయి.