Sunrisers Hyderabad: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 2025, 18వ ఎడిషన్ రెండో రోజు మెగా ఆక్షన్ రసవత్తరంగా సాగుతోంది. ఐపీఎల్ ఆడే మొత్తం 10 ఫ్రాంఛైజీలు ఇందులో పాల్గొన్నాయి. 577 మంది ప్లేయర్లల్లో తమకు కావాల్సిన గెలుపు గుర్రాల కోసం పోటీ పడుతోన్నాయి.
ఈ మెగా ఆక్షన్‌లో కొన్ని అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. శ్రీలంకకు చెందిన బ్యాటింగ్ ఆల్‌రౌండర్ ఈషాన్ మలింగ ధర్మసేనను కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఏకంగా 1.20 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది ఈ డెబ్యుటెంట్ కోసం. అతని బేస్ ప్రైస్ 30 లక్షల రూపాయలు.

ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ రేటును 1.20 కోట్ల రూపాయల వరకు తీసుకెళ్లింది. ఇప్పటివరకు ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు ఈషాన్. లిస్ట్ ఏ- 12, దేశవాళీ టీ20లు- 13, ఫస్ట్ క్లాస్- 16 మ్యాచ్‌లల్లో మెరుపులు మెరిపించాడు. లెఫ్ట్ హ్యాండ్ పించ్ హిట్టర్. రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్.
శ్రీలంక ఏ తరఫున ఒమన్‌లోని అల్ అమెరత్‌లో జరిగిన టోర్నమెంట్‌లో ఆడాడు. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లల్లో 13 వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ ఏపై 3/61 బెస్ట్ బౌలింగ్ ఫిగర్‌ను నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేయబోతోన్నాడు.. అది కూడా ఆరెంజ్ ఆర్మీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో.
ఇప్పటిదాకా మహ్మద్ షమీ-రూ. 10 కోట్లు, హర్షల్ పటేల్-రూ. 8 కోట్లు, ఇషాన్ కిషన్-రూ. 11.25 కోట్లు, అభినవ్ మనోహర్- రూ. 3.20 కోట్లు, రాహుల్ చాహర్- రూ. 3.20 కోట్లు, ఆడమ్ జంపా- రూ. 2.40 కోట్లు, సిమర్‌జీత్ సింగ్- రూ. 1.50 కోట్లు, అథర్వ టైడ్- రూ.30 లక్షలు, జీషాన్ అన్సారీ- రూ.40 లక్షలు, జయదేవ్ ఉనద్కత్- రూ. కోటి, కమిందు మెండీస్- రూ.75 లక్షలు ఆరెంజ్ ఆర్మీలో చేరారు.